ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విద్యుత్ ఉద్యోగులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. డిమాండ్ల పేరుతో గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సైలెంటుగా ఉండి ఇప్పుడు సమస్యలు ఆలకిస్తున్నారు కదా అని ప్రభుత్వంపై పడిపోయేందుకు రెడీ అవుతున్నారు. ఉద్యోగుల వ్యవహారంపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. బ్లాక్ మెయిల్ చేస్తే వారికి వేగంగా ఉద్వాసన చెప్పి వెంటనే ఉద్యోగాల కోసం చూస్తున్న వేల మంది యువతకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది.
సమాజంలో అత్యంత భద్రమైన జీవితం గడుపుతున్న ప్రభుత్వ ఉద్యోగులు
ప్రభుత్వ ఉద్యోగులు సమాజంలో అత్యంత భద్రమైన జీవితం గడువుతున్నారు. ఠంచనుగా జీతం వస్తుంది. వారు ఎంత పని చేస్తారో ప్రజలందరూ చూస్తూనే ఉంటారు. ఉచిత వైద్యం అందుబాటులో ఉంటుంది. అనేక విద్యాసంస్థలు ఉద్యోగుల పిల్లలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఉంటాయి. పండుగలు వస్తే డీఏలు వస్తాయి. విద్యుత్ ఉద్యోగులకు సంస్కరణల తర్వాత మరింత ఎక్కువగా జీతభత్యాలు వస్తున్నాయి. ఇతర ప్రజలతో పోలిస్తే అత్యధిక సౌకర్యాలు పొందుతూ ప్రధమ శ్రేణి పౌరులుగా చెలామణి అవుతూ.. తమ గొంతెమ్మ కోరికల కోసం ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడం దారుణం.
పన్నుల కట్టే వాళ్లు అసలు బకరాలా ?
సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు, చిరు వ్యాపారులు ఇలా అందరూ పన్నులు కట్టి తమను ధనవంతుల్ని చేయాలన్నట్లుగా ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. తమవి లక్షల కుటుంబాలని.. మా కుటుంబసభ్యుల ఓట్లు అని.. తాము తల్చుకుంటే ఓడిస్తామని ఇలాంటి ప్రకటనలు చేసి.. రెచ్చిపోతున్నారు. నిజానికి ఉద్యోగులకు ఎంత మంచి చేసినా.. చేయకపోయినా వారు ఎవరికి ఓటేయాలనుకుంటారో వారికే వేస్తున్నారని.. పోస్టల్ బ్యాలెట్లను బట్టి చూస్తే అర్థమైపోతుంది. కానీ వీరు ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేసే విధానం మాత్రం వేరుగా ఉంటుంది. ప్రజలు కట్టే పన్నులతో తమను లగ్జరీగా బతికేలా చేయాలని కోరుకుంటున్నారు. ఇతరుల జీవన ప్రమాణాలతో పోలిస్తే.. వీరు అన్నింటిలోనూ అధికంగా ఉంటారు. కానీ వీరే తమకేదో తక్కువయిందని బయలుదేరుతూంటారు.
కష్టపడి పని చేసేందుకు లక్షల మంది రెడీ !
ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్న వారి కన్నా ఎక్కువగా కష్టపడి పనిచేసేందుకు లక్షల మంది యువత రెడీగా ఉన్నారు. ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేసే వాళ్లను.. సమ్మె చేస్తామని బెదిరించే వాళ్లను.. జీతాలు పెంచాలని వేధించేవాళ్ల స్థానంలో కొత్త రిక్రూట్మెంట్లు చేసి.. యువతను తీసుకోవాలి. ఉద్యోగ భద్రత అని కష్టపడి పని చేసే వారికే ఉండాలి కానీ.. అప్పనంగా ప్రజాధనం జీతాలుగా తీసుకునేవారికి కాదు. ఈ విషయంలో ఉద్యోగుల్ని పాంపర్ చేసే ప్రయత్నం చేస్తే బెదిరిస్తూనే ఉంటారు. భయపడేవాడు ఉంటే..బెదిరించే వాడితే రాజ్యం అవుతుంది.