ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపుపై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు అయింది. సభ్యులుగా మంత్రులు లోకేష్, నారాయణ , పయ్యావుల కేశవ్ ఉంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ నిర్ణయం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు కుదిరితే తగ్గించాలి కానీ… మళ్లీ పెంచే ప్రయత్నం చేయడం ఏమిటనేది నిరుద్యోగులకు వస్తున్న ప్రధాన సందేహం.
ఉద్యోగ విరమణ వయసు పెంచాలని ఏ ఒక్క ఉద్యోగ సంఘం అడగడం లేదు. వారి డిమాండ్లలో అది లేదు. మరి ఎందుకు ఈ ఆలోచన చేస్తున్నారో ప్రభుత్వానికే తెలియాలి. గత ప్రభు్తవం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచింది. రిటైరయ్యే వాళ్లకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ ను చెల్లించడానికి డబ్బులు లేక.. రిటైర్మెంట్స్ ను వాయిదా వేయడానికి ఇలా రెండేళ్ల పొడిగింపు ఇచ్చారు.
ఇప్పుడు చాలా మంది రిటైర్ అవుతున్నారు. వారందరికీ బెనిఫిట్స్ ఇచ్చి రిటైర్మెంట్ ఇచ్చేసి..కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తే..యువతకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. సర్వీసులో చివరికి వచ్చిన వారికి పెద్ద ఎత్తున జీతభత్యాలు చెల్లించాలి. కొత్తగా చేరే వారికి తక్కువ జీతాలే ఉంటాయి. అలా అయినా ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్ల కన్నా ఎక్కువ పెంచాలన్న ఆలోచన చేస్తే..ప్రభుత్వంపై విమర్శలు పెరిగిపోతాయి.