ఏపీ లిక్కర్ స్కాం నిందితులకు ఒక్క రిలీఫ్ కూడా లభించడం లేదు. ఏ కోర్టుకు వెళ్లినా అదే పరిస్థితి. తాజాగా ధనుంజయ రెడ్డి, కృష్ణా మోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. తమను అరెస్టు చేస్తారని..అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని వీరు కోరారు. హైకోర్టులో పిటిషన్ ఉండగానే సుప్రీంకోర్టుకు వెళ్లారు.కానీ సుప్రీంకోర్టు హైకోర్టులో తేల్చుకుని రావాలని స్పష్టం చేసింది. ఇప్పుడు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇక సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.
మరో వైపు సీఐడీ అధికారులు దూకుడు చూపిసతున్నారు. రాజ్ కసిరెడ్డి, చాణక్య, అవినాష్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సిట్ సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో సిట్ తనిఖీలు చేస్తోంది. కస్టడీలో విచారణలో నిందితులు వెల్లడించిన సమాచారం ఆధారంగా సోదాలు చేస్తున్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి కీలకమైన విషయాలు వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికి డబ్బులు ఎవరెవరు వసూలు చేశారు.. ఎలా రూటింగ్ చేశారో స్పష్టత ఉంది. ఇప్పుడు సోదాల్లో ఆధారాలు సేకరించే అవకాశం ఉంది.
లిక్కర్ స్కాం అత్యంత పకడ్బందీగా ఉండటంతో సీఐడీ అధికారులు అంతే పక్కాగా వ్యవహరిస్తున్నారు. ఎవరికీ రిలీఫ్ దొరకడం లేదు. పేద ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుని వందల కోట్లు దోచుకున్న స్కాం కావడంతో పెద్ద ఎత్తున ఆస్తుల్ని సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే పాత్రధారుల్ని కాకుండా.. సూత్రధారుల్ని అరెస్టు చేయాలన్న లక్ష్యంతో సిట్ దర్యాప్తు చేస్తోంది. త్వరలోనే అసలు సూత్రధారులెవరో బయటకు వచ్చే అవకాశం ఉంది.