ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న లక్షలాది మంది పేదలకు కూటమి ప్రభుత్వం గట్టి భరోసానిచ్చింది. గతంలో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పథకాన్ని మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు గడువును 2026 డిసెంబర్ 31 వరకు పెంచుతూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో ఇంకా వేలాది మంది అర్హులు మిగిలి ఉన్నారనే నివేదికల ఆధారంగా, సామాన్యులకు తమ సొంత ఇంటిపై పూర్తి హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ పథకం కింద వర్గీకరించిన నిబంధనలు పేదలకు ఎంతో ఊరటనిస్తున్నాయి. 150 గజాల లోపు స్థలంలో ఇల్లు నిర్మించుకున్న వారికి ఎటువంటి రుసుము లేకుండా పూర్తిగా ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తారు. అంతకంటే ఎక్కువ అంటే, 150 నుండి 450 గజాల వరకు స్థలం ఉన్నవారు ప్రస్తుత రిజిస్ట్రేషన్ విలువలో కేవలం 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది. అయితే, ఈ వెసులుబాటు పొందాలంటే సదరు వ్యక్తులు 2019 అక్టోబర్ 15 కంటే ముందే ఆ స్థలంలో నివాసం ఉండి ఉండాలి.
అర్హులైన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ నివాసాలకు చట్టబద్ధమైన యాజమాన్య హక్కులను పొందాలని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియలో ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలను కూడా అమలు చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ , రక్షణ అవసరాల దృష్ట్యా.. చెరువులు, కుంటలు, కాలువ గట్లు, వాగులు ,డిఫెన్స్ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లకు ఈ పథకం వర్తించదు. కేవలం ఆక్రమణలకు గురికాకూడని అభ్యంతరకరమైన భూములు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ భూముల్లోని ఇళ్లకు ఈ గడువు పెంపు వర్తిస్తుంది. గతంలో సాంకేతిక కారణాల వల్ల లేదా సమాచారం లేక దరఖాస్తు చేసుకోలేకపోయిన పేదలకు ఇది ఒక సువర్ణావకాశమని చెప్పవచ్చు.
