రాష్ట్రానికి ఆదాయం పెరగాలి, యువతకు ఉపాధి రావాలి, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి.. అది కూడా వేగంగా జరగాలి. ఇప్పటికే ఐదు సంవత్సరాలు నవ్యాంధ్రలో వృధా అయ్యాయి. అందుకే సీఎం చంద్రబాబు, నారా లోకేష్ పరుగులు పెడుతున్నారు. ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు అందివచ్చిన గూగుల్ అవకాశాన్ని పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. ఒక్క గూగుల్ ను చూపించి ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దానికి నవంబర్‌లో జరగనున్న విశాఖ పెట్టుబడుల సదస్సును వేదికగా చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నవంబర్‌లో పెట్టుబడుల సదస్సు – దిగ్గజ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సహకారంతో విశాఖలో నవంబర్ లో పెట్టుబడుల సదస్సును నిర్వహిస్తున్నారు. దీన్ని ఆషామాషీగా నిర్వహించాలనుకోలేదు. గత ప్రభుత్వం నిర్వహించిన సదస్సు ఎంత పొలిటికల్ షో ఈవెంట్ లా మారిందో అందరూ చూశారు. అది రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేసింది. ఈ సారి మాత్రం అలాంటి వాటికి చాన్స్ లేకుండా అన్ని దేశాల నుంచి పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. ఇందు కోసం సీఐఐ సాయంతోనే ఇతర దేశాల్లో రోడ్ షోలు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి చంద్రబాబు, లోకేష్ స్వయంగా వెళ్లి ఆహ్వానాలు పలుకుతున్నారు. ఇప్పుడు లోకేష్ ఆస్ట్రేలియాలో ఉంటే చంద్రబాబు గల్ఫ్ వెళ్తున్నారు. తర్వాత లండన్ వెళ్తారు.
గూగుల్ ఒప్పందమే బ్రాండ్ అంబాసిడర్
చంద్రబాబు,లోకేష్ ఏపీకి సంబంధించిన ఏ చిన్న ప్లస్ పాయింట్‌నూ వదిలి పెట్టడం లేదు. పెట్టుబడిదారుల్లో ఏపీపై విశ్వాసం పెరిగిందనడానికి గూగుల్ పెట్టుబడే కారణం అని చంద్రబాబు,లోకేష్ పారిశ్రామికవేత్తలకు చెబుతున్నారు. వారిలో నమ్మకం కలిగిస్తున్నాయి. పాలసీల్లో రాయితీలు చాలా ఉంటాయని … హామీ ఇస్తున్నారు. మంచి ఎకోసిస్టమ్ ఏర్పాటు అవుతుందని.. భవిష్యత్ లోనూ ఇబ్బందులు రావని గట్టిగా భరోసా ఇస్తున్నారు. కేంద్రం ఈ విషయంలో ఏపీకి అండగా ఉంటోంది.పెట్టుబడులకు ఎలాంటి సమస్యలు ఉండవని వారికి హామీ ఇస్తోంది. గూగులే వచ్చింది కాబట్టి ఇతర కంపెనీలు కూడా విశాఖపై దృష్టి సారిస్తున్నాయి.
దిగ్గజ కంపెనీలతోనే పని కాదు..స్టార్టప్‌లనూ ప్రోత్సహించాలి !
అయితే దిగ్గజ కంపెనీలు పెట్టుబడులతో వస్తే పని కాదు. పెద్ద కంపెనీలతోనే అన్నీ అయిపోవు. మంచి ఎకోసిస్టమ్ ఏర్పడాలి అంటే.. స్టార్టప్‌లు ఏర్పాటవ్వాలి. చిన్నచిన్న ఆలోచనలతో ఉండేవారు.. పెద్ద పెద్ద లక్ష్యాలతో కృషి చేసేవారు కూడా..తమ ప్రయత్నాలను చేసుకునేందుకు అవసరమైన ఎకోసిస్టమ్‌ను ఏపీలో కల్పించాలి. తయారీ రంగానికి రాయలసీమ.. సేవల రంగానికి ఉత్తరాంధ్రను టార్గెట్ చేసుకున్నారు కాబట్టి ఆయా చోట్ల కొత్తగా ప్రయత్నాలు చేసేవారికి అవకాశాలు కల్పించాల్సి ఉంది. అలాంటి వాతావరణాన్ని చంద్రబాబు, లోకేష్ క్రియేట్ చేయగలిగితే … ఏపీకి తిరుగు ఉండదన్న అభిప్రాయం ఉంది.
