ఏపీలో ముందస్తుగానే స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. జగన్ రెడ్డి ఏరికోరి నియమించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సహాని తన పదవి కాలం ముగిసేలోపే ఎన్నికలను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఆమె పదవి కాలం ముగిసిపోతుంది. ఆ లోపు ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటున్నారు. ఎస్ఈసీగా ఉన్న వారు తమ హయాంలో ఒక్క సారి అయినా ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటారు. గతంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆమె పదవి బాధ్యతలు చేపట్టారు. అందుకే ఇప్పుడు మూడు నెలల ముందుగానే నిర్వహించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టారు.
పదవి కాలం పూర్తయ్యే లోపు ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న నీలం సాహ్ని
నాలుగు దశల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. జిల్లా, మండల పరిషత్, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో మార్చిలోపు పూర్తి చేయాలని ప్లాన్ రెడీ చేసుకున్నారు. నిజానికి తాము నియమించిన ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహిస్తూంటే.. జగన్ రెడ్డి సిద్ధాంతం ప్రకారం.. ముందూ వెనుకా చూసుకోకుండా ఎన్నికల్లో పోటీ చేయాలి. కానీ పులివెందుల, ఒంటిమిట్ట ఉపఎన్నికల్ని వాయిదా వేయాలని కోరినా నీలం సహాని పట్టించుకోకపోవడంతో…ఆమెను నియమించడం వల్ల ప్రయోజనాలు లేవని .. స్థానిక ఎన్నికల్లో కొరడా దెబ్బలు పడతాయని అర్థం అయింది.
కేంద్ర బలగాల భద్రత సాకుతో పరారయ్యేందుకు ప్లాన్
అందుకే ఇప్పుడు వైసీపీ స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాల భద్రతతో నిర్వహించాలని డిమాండ్ చేయడం ప్రారంభించింది. అలా నిర్వహిస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తామన్న సంకేతాలు ఇస్తున్నారు. అంటే.. స్థానిక ఎన్నికలను బహిష్కరించడానికి మార్గం సుగమం చేసుకున్నారన్నమాట. పులివెందులలోనే అత్యంత ఘోరంగా ఓడిపోయిన పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎక్కడా గెలిచే అవకాశం ఉండదు. ఆ విషయం జగన్ కు తెలుసు. పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం కన్నా.. పోటీ చేయకుండా.. ఉంటే బెటరని అనుకుంటున్నారు. అందుకే కేంద్ర బలగాల భద్రత అని కబుర్లు చెబుతున్నారు.
జగన్ నియమించిన నీలం సాహ్ని ఎన్నికలు నిర్వహిస్తున్నా పోటీ చేయలేరా ?
జగన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయాం.. ఏ ఎన్నికలోనూ పోటీ చేయడం లేదు. తప్పనిసరిగా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీల్లో పోటీ చేసి పరువు పోగొట్టుకున్నారు. అదికూడా బాయ్ కాట్ చేయాలనుకున్నారు కానీ .. నిర్ణయం తీసుకునే సరికే ఆలస్యమయింది. అందుకే ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే .. కారణాలు చెప్పడం ప్రారంభించారు. గతంలో ఎస్ఈసీ నిమ్మగడ్డను చంద్రబాబు నియమించారని జగన్ ఆరోపించేవారు. ఇప్పుడు జగన్ నియమించిన నీలం సాహ్నినే ఎన్నికలు నిర్వహిస్తే ఎందుకు భయపడతారో మరి ?