ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఈగకూడా వాలనీయకుండా చూసుకునే తమ్ముళ్లు.. తెలిసో తెలియకో కానీ ఆయన్ని ఇరుకున పెట్టేస్తున్నారు. ఈ విషయంలో తెలియక చేస్తున్నారనుకుందామంటే… ఆ పనిచేస్తుంది చిన్నా చితకా వ్యక్తులు కాదు.. మంత్రులు, సీనియర్ రాజకీయ నాయకులు. మరి ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇది కావాలని చేస్తున్న పనిగా అనిపించకపోయినా, జనాలకు అర్ధమయ్యే విషయం మాత్రం అదే! “నువ్వు చేసి చూపించు” అనడంలో మన చేతకాని తనం అంతర్లీనంగా దాగుందనే విషయం మరిచిన ఏపీ మంత్రులు చేస్తున్న పనులను ఇప్పుడు పరిశీలిద్దాం.
జగన్ పోరాటాల ఫలమో, పవన్ ట్వీట్ల ఫలితమో, జల్లికట్టు ఆదర్శమో… కారణం ఏదైనా కానీ తాజాగా మరోసారి ఏపీలో ప్రత్యేక హోదా అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా జనవరి 26న విశాఖ ఆర్కే బీచ్ లో ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమాలు తలపెట్టారు. చాలా మంది వూహించినట్లుగానే భద్రత కారణాలు చెప్పి అనుమతి నిరాకరించారు ఏపీ డీజీపీ. చంద్రబాబు కు చెప్పకుండానే ఈ ప్రకటన చేశారా? బాబు చెప్పమంటేనే ఈ నిర్ణయం ప్రకటించారా? వంటి విషయాలు ఇప్పుడు అప్రస్తుతం. ఆ సంగతులు అలా ఉంటే… ఈ విషయంలో స్పందించిన ఏపీ మంత్రులు .. “ఎన్నికల ప్రచార సమయంలో మోడీ పక్కనే కూర్చున్న పవన్.. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా విషయంపై ప్రధానితో మాట్లాడాలి” అని ఉచిత సలహా ఒకటి ఇచ్చారు. ఈ మాట అన్నది మరెవరో కాదు ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు. దీనిపై పవన్ వెంటనే ట్వీటారు.
“నేను మోడీ గారితో ప్రచార సభల్లోనే కూర్చున్నాను కానీ.. మీ ఎంపీలందరూ ఆయనతో పార్లమెంటులోనే కూర్చుంటున్నారు కదా. వారేం చేస్తున్నారు..? మీడియా ముందుకొచ్చి కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వడం లేదని చెప్పడం తప్ప. అసలు ఇస్తారో ఇవ్వరో తర్వాత సంగతి.. ప్రజల అసంతృప్తిని కేంద్రానికి చెప్పడానికి కూడా మీరు భయపడితే ఎలా.. మీరు ఆపని చేయపోకబట్టేకదా ఈ రోజు యువత రోడ్లమీదకు వస్తుంది. మీరూ ఏమీ చేయకండి.. యువతనూ చేయనియ్యకండి..మరి దీనికి పరిష్కారం ఏమిటి?” అని పవన్ స్పందించారు.
ఈ విషయంలో ఏపీ మంత్రులు గ్రహించని విషయం ఏమిటంటే… స్పెషల్ స్టేటస్ పై ఢిలీ వెళ్లి మోడీని కలవమని, సాధించమని పవన్ కు చెప్పడం వెనక… “మా వల్ల, మా చంద్రబాబు వల్లా కావడం లేదు” అని వారి చేతకాని తనాన్ని ఒప్పుకున్నట్లవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారంలో ఉన్నవారు… అధికారికంగా ఏ అధికారం లేని వ్యక్తిని వెళ్లి మోడీతో మాట్లాడమని చెప్పడం సీఎం, మంత్రులు, ఎంపీలు వారి అసమర్ధతను ఇంతకంటే బాగా ఎలా ఒప్పుకుంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇలా పవన్ ను ఢిల్లీ వెళ్లి మోడీతో మాట్లాడమంటూ… చంద్రబాబు శక్తిని, స్థాయిని ఏపీ మంత్రులు తగ్గించేస్తూ, బాబును ఇరుకున పెడుతున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం.