ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అనుసరిస్తున్న సరికొత్త పనితీరు ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సామాన్య ప్రజల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఎటువంటి హంగామా లేకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆయన చేస్తున్న ఆకస్మిక తనిఖీలు చేస్తూ …క్షేత్ర స్థాయి వాస్తవాలు తెలుసుకుంటున్నారు.
నిజమైన నాయకత్వం – ఆకస్మిక తనిఖీలతో అట్టడుగున మార్పు
సాధారణంగా ఒక మంత్రి పర్యటన అంటే భారీ కాన్వాయ్, అధికారుల హడావిడి, రోడ్ల క్లీనింగ్ వంటి హంగామా కనిపిస్తుంది. కానీ నారా లోకేష్ ఈ సంప్రదాయానికి భిన్నంగా వెళ్తున్నారు. మైలవరం స్కూల్ సందర్శన దీనికి సాక్ష్యం. ముందస్తు సమాచారం లేకుండా వెళ్లడం వల్ల క్షేత్రస్థాయిలో అసలు వాస్తవాలు బయటపడుతున్నాయి. అధికారులు సిద్ధం చేసిన అన్నీ బాగున్నాయి అనే రిపోర్టుల కంటే, ప్రజలు నేరుగా చెప్పే సమస్యలే మేలని ఆయన నమ్ముతున్నారు. ఇలాంటి ఆకస్మిక తనిఖీలు క్షేత్రస్థాయి యంత్రాంగంలో జవాబుదారీతనాన్ని పెంచుతాయి.
ప్రతి ఎమ్మెల్యే అలా పర్యవేక్షణ చేస్తే నష్టం ఏమిటి?
కేవలం మంత్రులే కాకుండా ప్రతి ఎమ్మెల్యే నెలకు కనీసం ఒకసారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేయడం, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల కష్టాలను స్వయంగా చూడటం అత్యవసరం. ఏసీ గదుల్లో కూర్చుని ఇచ్చే ఆదేశాల కంటే, ఆసుపత్రి బెడ్ల పరిస్థితిని, స్కూల్ భోజన నాణ్యతను స్వయంగా పరీక్షించినప్పుడే వ్యవస్థలో లోపాలు అర్థమవుతాయి. ప్రజలతో మమేకమైనప్పుడే నాయకుడికి సమాజంపై సరైన అవగాహన ఏర్పడుతుంది. ఇది కేవలం ఒక ఫోటో షూట్ లాగా కాకుండా, ఒక నిరంతర ప్రక్రియగా మారాల్సిన అవసరం కనిపిస్తోంది.
క్యాడర్ తోనూ ఇలాగే చర్చించాలి!
రాజకీయ నాయకులకు చుట్టూ ఉండే భజన బృందాల వల్ల ఒక్కోసారి బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే, ముఖ్యనేతలు తమ క్యాడర్‌తో, క్షేత్రస్థాయి కార్యకర్తలతో ఎటువంటి ఆర్భాటం లేకుండా ఏకాంతంగా మాట్లాడటం చాలా ముఖ్యం. కార్యకర్తలు నేరుగా తమ మనసులోని మాటను, ప్రజల అభిప్రాయాలను నిర్భయంగా చెప్పగలిగినప్పుడే నాయకుడికి అసలైన ఫీడ్ బ్యాక్ అందుతుంది. లోకేష్ తన పర్యటనల్లో కార్యకర్తలకు సమయం కేటాయిస్తూ, వారి కష్టసుఖాలు వినడం ద్వారా పార్టీ మూలాలను పటిష్టం చేస్తున్నారు.
ఈ కొత్త తరహా రాజకీయాలు రాష్ట్రంలో ఒక పాజిటివ్ ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. నాయకుడు స్వయంగా క్షేత్రస్థాయికి వస్తున్నాడన్న భయం అధికారుల్లో ఉంటేనే పనులు వేగంగా జరుగుతాయి. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందుతున్నాయా లేదా? ఎక్కడ అవినీతి జరుగుతోంది? అనే విషయాలు ఇలాంటి పర్యటనల ద్వారానే వెలుగులోకి వస్తాయి. లోకేష్ బాటలోనే ఇతర ప్రజాప్రతినిధులు కూడా నడిస్తే, పాలనలో పారదర్శకత పెరిగి, ప్రజలకు ప్రభుత్వంపై మరింత నమ్మకం కలిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

