ప్రభుత్వం ఎక్కడైనా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతుంది.కానీ ఏపీలో మాత్రం కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికే గుడ్ న్యూస్ చెబుతూంటాయి. తాము ప్రభుత్వంపై పోరాడే ప్రశ్నే లేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తన సంఘంలో తీర్మానం చేయించేశారు. ఉద్యోగుల సమస్యల సాధన కోసం ఏర్పడిన ఓ సంఘం తాము పోరాడకూడదని తీర్మానం కూడా చేస్తుందా అని ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు. కనీ ఏపీలో ఏదైనా సాధ్యమేనని బండి శ్రీనివాసరావు నేతృత్వంలోని ఏపీ ఎన్జీవో సంఘం నిరూపించింది.
నిజానికి ఏపీలో ఉద్యోగులు జీతాలు, పెన్షన్లకు కటకటలాడిపోతున్నారు. కనీసం జీతాలైనా ఇవ్వండి మహా ప్రభో అంటున్నారు. ఓ వైపు వారంలో రద్దు చేస్తామన్న సీపీఎస్ రద్దు చేయలేదు. హెల్త్ కార్డులు పని చేయడం లేదు. డీఏలు ఇస్తామన్నవి ఇవ్వడం లేదు. పీఆర్సీ పేరుతో జీతాలు తగ్గించారు. గత ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లే ముందే మధ్యంతర భృతి ఇరవై శాతం ఇచ్చింది.ఇప్పుడు ఎన్నికలు వస్తున్నా… ప్రభుత్వం కొత్త పీఆర్సీ ఆలోచన చేయకపోగా… మధ్యంతర భృతి ఇచ్చే చాన్స్ కూడా లేదు. ప్రతీ ఉద్యోగిని ఆర్థికంగా దెబ్బుకొడుతున్న ప్రభుత్వంపై పోరాడేందుకు ఏపీఎన్జీవోలు సిద్ధంగా లేరు.
మరో వైపు బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ అనే ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం పోరాడుతున్నారు. ప్రభుత్వంపై తమ ఉద్యమ కార్యచరణ ప్రకటించారు. దీంతో ఉద్యోగులంతా వీరి సంఘాల వైపు ఆకర్షితులవుతున్నారు. వారికి మద్దతు తెలుపుతున్నారు. ఏపీ ఎన్జీవో సంఘం …ఇదే పద్దతిలో ఉంటే.. త్వరలో నిర్వీర్యం అయిపోతుందని.. అందరూ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ వెంట వేళ్లే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.