ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ ఆస్తులు, ముఖ్యంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేస్తూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై గ్రామ/వార్డు సెక్రటేరియట్లలోనే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది కూడా మార్కెట్ విలువ రూ. 10 లక్షలకు తక్కువ ఆస్తులకు రూ. 100 మాత్రమే ఫీజు. భూమి వివాదాలు తగ్గి, రాష్ట్రంలో 3.9 లక్షల మంది భూమి యజమానులకు హక్కులు వస్తాయి.
భూయజమాని మరణం తర్వాత కుటుంబసభ్యులు ఆ ఆస్తులను తమ పేర్లపై బదలాయించుకోవడానికి రకరకాల కారణాల వల్ల ఆలస్యం చేస్తున్నారు. చివరికి అనేక డాక్యుమెంట్లు.. ఫ్యామిలీ సర్టిఫికెట్ల సమస్యల వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. భూవివాదాలు పెరుగుతున్నాయి. అందుకే ఆ సమస్యల పరిష్కారం చేయాలని ఈ విధానాన్ని ప్రవేశ పెట్టారు. అయితే భూయజమాని మరణించిన వారసులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.
మరణ సర్టిఫికెట్, లీగల్ హెయిర్ సర్టిఫికెట్, ఆధార్, ఆస్తి డాక్యుమెంట్లు, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (EC) సమర్పించాలి. డిజిటల్ అసిస్టెంట్ వెరిఫై చేసి రిజిస్ట్రేషన్ చేస్తారు. మ్యూటేషన్ ఆటోమేటిక్‌గా జరిగి, ఈ-పాస్‌బుక్ జారీ అవుతుంది. గతంలో వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు MROలు లేదా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది, అక్కడ ప్లెయిన్ పేపర్లో వివరాలు సమర్పించి కార్యాలయం చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇప్పుడు స్థానిక సెక్రటేరియట్లలోనే పూర్తి చేస్తారు.