ఆంధ్రప్రదేశ్ నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ ఒకేరోజు రెండున్నర లక్షల టిడ్కో గృహప్రవేశాల మెగా కార్యక్రమం అట్టహాసంగా జరుగనుంది.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు గృహ యోగం కల్పిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ మున్సిపాలిటీల్లో నిర్మించిన ఈ అపార్ట్మెంట్ తరహా గృహాలు నేడు పండుగ వాతావరణంలో లబ్ధిదారుల పరం కానున్నాయి.
గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో టిడ్కో ఇళ్లను పూర్తిగా విస్మరించిందని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఆ ఇళ్లను పాడుబెట్టిందనే విమర్శలు ఉన్నాయి. నిర్వహణ లేక అసంపూర్తిగా వదిలేసిన ఈ భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారడమే కాకుండా, లబ్ధిదారులు కట్టిన సొమ్ముకు భద్రత లేని పరిస్థితి నెలకొంది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే టిడ్కో గృహాలపై ప్రత్యేక దృష్టి సారించి, నిధులు విడుదల చేసి మరీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ , తాగునీటి సౌకర్యాలను అత్యంత వేగంగా పూర్తి చేయించింది.
ఈ ఇళ్ల పంపిణీలో ప్రభుత్వం లబ్ధిదారులకు భారీ ఊరటనిస్తూ సబ్సిడీలను ,రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసింది. 300 చదరపు అడుగుల ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే అందజేయడంతో పాటు, 365 , 430 చదరపు అడుగుల ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల వాటాను తగ్గించేలా చర్యలు తీసుకుంది. బ్యాంక్ రుణాల మంజూరులో ఉన్న అడ్డంకులను తొలగించి, సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం పూచీకత్తుగా నిలిచింది. దీంతో దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాలకు నేడు విముక్తి లభించినట్లయింది.
ఈ మెగా గృహప్రవేశాల కార్యక్రమం ద్వారా ప్రభుత్వం తన ప్రాధాన్యతను స్పష్టం చేసింది. రాజకీయాల కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమని, నిర్లక్ష్యంగా వదిలేసినా భవనాలను నివాస యోగ్యమైన సుందర నగరాలుగా తీర్చిదిద్దడం ద్వారా తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంది. నేడు గృహప్రవేశం చేస్తున్న రెండున్నర లక్షల కుటుంబాల్లో మహిళల పేరిట రిజిస్ట్రేషన్లు జరగడం వల్ల వారికి సామాజిక భద్రతతో పాటు ఆత్మగౌరవం లభిస్తోంది.