ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రపంచ దిగ్గజ సంస్థ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మెర్సెక్ పేరుతో కంటెయినర్ల మీద కనిపించే బ్రాండ్ ఏపీఎమ్ టెర్మినల్స్ ది. ఆ కంపెనీ ఏపీలో బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ (APMB) ద్వారా, రాష్ట్రంలో ఓడరేవు , టెర్మినల్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి A.P. మోల్లర్ – మెర్స్క్ గ్రూప్‌లో భాగమైన APM టెర్మినల్స్తో ఒక అవగాహన ఒప్పందం పై సంతకం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.
APM టెర్మినల్స్ 2004 నుండి భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఉన్న గుజరాత్ పిపావావ్ పోర్ట్ లిమిటెడ్ , మహారాష్ట్రలోని JNPA పోర్ట్‌లో ఉన్న గేట్‌వే టెర్మినల్స్ ఇండియాలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంటైనర్, బల్క్ హ్యాండ్లింగ్‌లో సామర్థ్యాన్ని పెంచడంలో కంపెనీ ముందంజలో ఉంది. APM టెర్మినల్స్, అవగాహన ఒప్పందంలో భాగంగా, ఆధునికీకరించిన ఓడరేవులు, టెర్మినల్స్‌ను అభివృద్ధి చేయడంలో ఆంధ్రప్రదేశ్‌లో 1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది.
ఈ పెట్టుబడి 8,000 నుండి 10,000 వరకు ప్రత్యక్ష , పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అనుబంధ పారిశ్రామి. లాజిస్టిక్స్ కార్యకలాపాలు పెరగడానికి దోహదం చేస్తుంది. అత్యాధునిక టెర్మినల్స్ ఏర్పాటు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పోర్టుల అభివృద్ధి కూడా ఒప్పందంలో భాగం. ఆంధ్రప్రదేశ్‌కు సముద్ర తీరం అత్యంత విలువైన ఆస్తి అని చంద్రబాబు చెబుతూ ఉంటారు. వాటిని పెట్టుబడులకు కేంద్రంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. దావోస్‌లో మెర్సెక్ ఓనర్‌తో చంద్రబాబు పది నిమిషాల సమావేశమే పెట్టుబడుకు మార్గం చూపించిందని నారా లోకేష్ ట్వీట్ చేశారు.