ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన 2018 గ్రూప్-1 నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో నిరుద్యోగుల ఆశలతో ఆడుకున్న చీకటి అధ్యాయంగా 2018 గ్రూప్-1 నియామక ప్రక్రియ మిగిలిపోయింది. టీడీపీ హయాంలో సాఫీగా జరిగిన ప్రక్రియ జగన్ అధికారంలోకి వచ్చాక అక్రమాలకు కేంద్రంగా మారింది. రాజకీయ ప్రయోజనాల కోసం, అవినీతి కోసం కంపు చేసి పెట్టారనే ఆరోపణలు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతున్నాయి.
పోస్టుల అమ్మకం.. మార్కుల తారుమారు ఆరోపణలు
అడ్డగోలుగా రీ-వాల్యుయేషన్ చేయించడం, రూల్స్ మార్చడం, చివరికి హాయ్ లాండ్ వంటి ప్రైవేట్ ప్రదేశాలలో సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయించడం వంటి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ అరాచకాలను తీవ్రంగా పరిగణించిన హైకోర్టు, తాజాగా ఏడీజీ స్థాయి అధికారితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో ఈ సిట్ ఏర్పాటయింది. జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే అప్పటికే సాఫీగా సాగుతున్న ఎంపిక ప్రక్రియలో వేలు పెట్టి అర్హులైన వారికి అన్యాయం చేశారన్న అనుమానాలు ఉన్నాయి.
ఎన్నో అరాచకాలు వెలుగులోకి
అభ్యర్థులకు డిజిటల్ మూల్యాంకనంలో ఒకలా, మాన్యువల్ మూల్యాంకనంలో మరోలా మార్కులు రావడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని హైకోర్టు స్వయంగా అనుమానం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియలో ఒక్కో పోస్టును కోట్లకు అమ్ముకున్నారని, డెప్యూటీ కలెక్టర్ వంటి పోస్టులకు భారీగా రేట్లు ఫిక్స్ చేశారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలకు తోడు, ఇప్పుడు సిట్ విచారణ ఈ దిశగా లోతుగా దర్యాప్తు చేయనుంది. బాధ్యులైన అధికారుల ప్రమేయంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోర్టు ఆదేశించడం ఈ కేసు తీవ్రతను తెలియజేస్తోంది.
సిట్ వేగం.. నిరుద్యోగుల ఆశ
హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం సిట్ అధిపతిగా సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ను నియమించింది. అయితే, ఈ విచారణలో కాలయాపన జరిగితే ఇప్పటికే తీవ్ర అన్యాయానికి గురైన నిరుద్యోగులకు శాశ్వత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మార్చి 16లోగా నివేదిక సమర్పించాలని కోర్టు గడువు విధించింది. సిట్ అత్యంత వేగంగా అడుగులు వేసి.. ప్రైవేట్ ఏజెన్సీల ప్రమేయం, బార్కోడ్ల తారుమారు, కీలకమైన ఓఎంఆర్ షీట్ల స్థితిగతులపై స్పష్టత రావాలి. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరైనా సరే, వారిని చట్టం ముందు నిలబెట్టినప్పుడే రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ గౌరవం నిలబడుతుంది.
న్యాయం గెలవాలి!
ప్రస్తుతం విధుల్లో ఉన్న 111 మంది ఎంపికైన అభ్యర్థులను నాన్-ఫోకల్ పోస్టులకు మార్చాలని కోర్టు ఆదేశించడం ద్వారా విచారణపై ఎలాంటి ప్రభావం పడకుండా జాగ్రత్త పడింది. ఇది కేవలం ఒక పరీక్షకు సంబంధించిన వివాదం మాత్రమే కాదు, వేలాది మంది కష్టపడి చదువుకునే నిరుద్యోగుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. అరాచక పాలనలో జరిగిన అక్రమాలను వెలికితీసి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా సిట్ తన నివేదికను పారదర్శకంగా సమర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిపక్షంలో సామాన్యులకు వ్యవస్థల మీద నమ్మకం సడలిపోయే ప్రమాదం ఉంది.