కూటమి ప్రభుత్వం ఐటీ రంగ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు పాలనలోనూ సాంకేతికను జోడించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం టెక్నాలజీ సర్వీసును జిల్లాల స్థాయికి విస్తరిస్తూ , 26జిల్లాలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ.
కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీటీఎస్ కార్యకలాపాలు మరింత విస్తృతం అయ్యాయి. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ ప్రొక్యూర్మెంట్స్, ఆధార్ ఆధారిత సేవలు, డిజిటల్ సంతకాలతో ధ్రువపత్రాల జారీ, సైబర్ సెక్యూరిటీ విభాగాలకు సంబంధించి ఏపీటీఎస్ సమర్ధవంతంగా సేవలు అందిస్తోంది. ఈమేరకు రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ విధానాలను అమలు చేసే నోడల్ ఏజెన్సీగా ఏపీటీఎస్ వివిధ రకాల సేవలను అందిస్తోందని విజయవాడలోని ఏపీటీఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వివరించారు మన్నవ మోహనకృష్ణ .
సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ ద్వారా ఆదాయం భారీగా పెరగనుందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీటీఎస్ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ లక్ష్యం సుమారు 600 కోట్లుగా నిర్దేశించారు. ఇక, కూటమి అధికారంలోకి వచ్చిన ఈ స్వల్ప కాలవ్యవధిలో ఈ ప్రొక్యూర్మెంట్ ఫ్లాట్‌ఫాం ద్వారా 41 వేల రూపాయల విలువైన 55,486 టెండర్లు పిలిచాయని, ఏపీటీఎస్ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ ద్వారా 110 కోట్ల రూపాయలకు పైగా కొనుగోలు లావాదేవీలు జరిగాయని తెలిపారు.
ప్రజలకు ఈజీగా సాంకేతికతో పథకాలను అందించేందుకు ఏపీటీఎస్ కృషి చేస్తుందని, ఈ ఏడాది 19.3 కోట్ల ఆధార్ ఆధారిత సేవలు, 5.98 కోట్ల ఈకేవైసీ లావాదేవీలను నిర్వహించిందని, 19,500 డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు జారీ చేసిందని తెలిపారు మన్నవ మోహనకృష్ణ .