ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బాలీవుడ్‌పై తాను చేసిన మతపరమైన వివక్ష వ్యాఖ్యల నేపథ్యంలో తలెత్తిన దుమారంపై స్పందించారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలకు సమాధానంగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
వీడియోలో ఏముందంటే?
బాలీవుడ్ లో తనకు అవకాశాలు రాకపోవడం వెనుక మత వివక్ష ఉందని చేసిన వ్యాఖ్యల్లో తన ఉద్దేశాలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని రెహమాన్ అన్నారు. భారతదేశం నా స్ఫూర్తి, నా గురువు , నా ఇల్లు. సంగీతం అనేది ఎప్పుడూ సంస్కృతిని గౌరవించడానికి, వేడుక చేసుకోవడానికి నేను ఎంచుకున్న మార్గం. నా ఉద్దేశాలను కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోవచ్చు, కానీ నా ఉద్దేశం ఎప్పుడూ సంగీతం ద్వారా ప్రజలను ఉత్తేజితం చేయడం , సేవ చేయడమేనని “అన్నారు.
ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదన్నారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని, తన చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. భారతదేశంలో సృజనాత్మక స్వేచ్ఛ ఉండటం తన అదృష్టమని, ఇక్కడ విభిన్న స్వరాలకు గౌరవం లభిస్తుందన్నారు. తన కెరీర్లో భారత్ పట్ల తనకున్న గౌరవాన్ని చాటిచెప్పే అనేక ప్రాజెక్టులను ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రధానమంత్రి సమక్షంలో ప్రదర్శన ఇవ్వడం నుంచి, నాగాలాండ్ సంగీతకారులతో కలిసి పనిచేయడం, సన్‌షైన్ ఆర్కెస్ట్రా ను నిర్మించడం వరకు ప్రతి అంశం తన లక్ష్యాన్ని బలపరిచిందని చెప్పారు.
హాలీవుడ్ దిగ్గజం హన్స్ జిమ్మర్తో కలిసి తాను చేస్తున్న రామాయణం సినిమా ప్రాజెక్ట్‌ను కూడా ఆయన ప్రస్తావించారు. గత వైభవాన్ని గౌరవిస్తూ, భవిష్యత్తుకు స్ఫూర్తినిచ్చే సంగీతాన్ని అందించడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని రెహమాన్ చెబుతున్నారు కానీ.. ఆయన ఉద్దేశం ఏమిటో మాత్రం చెప్పలేదు. ఆయన ఇంటర్యూలో చెప్పిన మాటలు సూటిగానే.. స్పష్టంగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన దాన్ని కవర్ చేసుకునేందుకు సింక్ కాని వివరణలు ఇస్తున్నట్లుగా కనిపిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


