సంగీత ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచిన ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజం, తన కెరీర్ పతనాన్ని మతంతో ముడిపెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. దశాబ్దాలుగా భారతీయ ప్రేక్షకులు ఆయనను కేవలం ఒక గొప్ప మ్యూజిషియన్‌గా, దేశం గర్వించదగ్గ కళాకారుడిగానే చూశారు తప్ప, ఎప్పుడూ ఆయన మతాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఆయన సృష్టించిన అద్భుత స్వరాలకు దేశం మొత్తం ఫిదా అయింది. కానీ ఇప్పుడు తనకు అవకాశాలు తగ్గడానికి కారణం మతపరమైన వివక్ష అని ఆయన వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ ఇంటర్యూలో బాలీవుడ్ పై ఆయన మత వివక్ష ముద్ర వేసే ప్రయత్నం గట్టిగా చేశారు.
ప్రతిభ మాత్రమే సినిమా పరిశ్రమల్లో కొలమానం
సినిమా రంగం అనేది పూర్తిగా విజయాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిభ ఉన్నంత కాలం, పాటలు హిట్టవుతున్నంత కాలం పరిశ్రమ ఎవరి వెనుకైనా పరుగెడుతుంది. రెహమాన్ అగ్రస్థానంలో ఉన్నప్పుడు దిగ్గజ దర్శకులు, నిర్మాతలు ఆయన డేట్స్ కోసం క్యూ కట్టారు. అప్పుడు లేని మతపరమైన అంశం ఇప్పుడు కొత్తగా ఎందుకు తెరపైకి వస్తుంది. ఒక కళాకారుడి సక్సెస్ గ్రాఫ్ తగ్గినప్పుడు అవకాశాలు తగ్గడం సహజం. రెహమాన్ ఇటీవల కాలంలో అందించిన సంగీతంలో మునుపటి మ్యాజిక్ లేదని, ఆయన శైలికి ప్రేక్షకుల ఆదరణ తగ్గుతోందని విమర్శలు ఉన్నాయి. ఈ సహజమైన మార్పును అంగీకరించకుండా బాలీవుడ్‌పై మతం ముద్ర వేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బాలీవుడ్‌పై ఎప్పుడూ అలాంటి విమర్శలు రాలేదే!
బాలీవుడ్ చరిత్రలో మతం ఎప్పుడూ అడ్డంకిగా మారలేదు. అక్కడ ఖాన్ల హవా దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఎందరో దర్శకులు, సంగీతకారులు, సాంకేతిక నిపుణులు అదే వర్గానికి చెందిన వారు విజయవంతంగా రాణిస్తున్నారు. ఇలాంటి వాతావరణం ఉన్న పరిశ్రమలో, తనకు అవకాశాలు రాకపోవడానికి మతమే కారణమని రెహమాన్ అనడం బాలీవుడ్ ఉనికినే అవమానించినట్లు అవుతుందని శోభా డే వంటి వారు వాదిస్తున్నారు. తన వ్యక్తిగత వైఫల్యాలకు వ్యవస్థను నిందించడం, అందులోనూ మతాన్ని జోడించడం వల్ల ఆయన ప్రతిష్టే దెబ్బతినే అవకాశం ఉంది.
ఫ్రస్ట్రేషన్లో రెహమాన్ తప్పిదం?
నిజానికి రెహమాన్ వ్యాఖ్యలు సమాజంలో ఒక తప్పుడు సంకేతాన్ని పంపిస్తున్నాయి. తన సంగీతంతో ప్రజలను ఏకం చేసిన ఒక మహోన్నత వ్యక్తి, ఇప్పుడు తనను ఒక వర్గానికి పరిమితం చేసుకుంటున్నారా అన్న అనుమానం కలుగుతోంది. అవకాశాలు తగ్గడానికి కారణాలు వెతుక్కోవాల్సింది తన పనితీరులో గానీ, మతంలో కాదని సామాన్య జనం కూడా అభిప్రాయపడుతున్నారు. కళకు మతాతీతమైన గౌరవం ఇచ్చే ఈ దేశంలో, ఒక గ్లోబల్ ఐకాన్ ఇలాంటి సంకుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరంగా భావిస్తున్నారు. కొసమెరుపేమిటంటే రెహమాన్ పుట్టుకతో ముస్లిం కాదు.. హిందువుగా పుట్టి ముస్లింలోకి కన్వర్ట్ అయ్యారు.
