తని ఒరువన్‌ని తెలుగులో రీమేక్ చేస్తున్నారనగానే అందరి మదిలో ఒకే ప్రశ్న మొదలైంది. ‘అరవింద్ స్వామి క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు?’ అని. ఎందుకంటే తని ఒరువన్ సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపిన పాత్ర అది. విషపు నవ్వులు చిందిస్తూ… స్టైలీష్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు అరవింద్ స్వామి. అసలు ఆ పాత్ర కోసమే తని ఒరువన్‌ని మళ్లీ మళ్లీ చూసినవాళ్లున్నారు. మరి ఆ స్టామినా తెలుగులో ఎవరికి ఉంది? ఈ పాత్ర కోసం చరణ్ కూడా చాలా పేర్లు పరిశీలించాడు. చివరికి మాధవన్ ని తీసుకొందామనేంత వరకూ సాగింది ఆ వేట. వాళ్లెవ్వరూ కాదు.. ‘నాకు అరవింద్ స్వామినే కావాలి’ అంటూ చరణ్ ఫిక్సయ్యాడు. అయితే అరవింద్ స్వామి మాత్రం చేసిన పాత్రనే చేయడానికి మనసు అంగీకరించక సుతిమెత్తగా తిరస్కరించాడు. కానీ…. చరణ్ వదల్లేదు. భారీ పారితోషికంతో వల వేశాడు. దానికి అరవింద్ స్వామి కూడా పడ్డాడు. అలా.. అరవింద్ క్యారెక్టర్ ధృవలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇప్పుడు ఈ సినిమా జాతకాన్ని కూడా అరవింద్ స్వామినే మార్చబోతున్నాడన్నది స్పష్టమైంది. ట్రైలర్ చూస్తుంటే… చరణ్ కంటే అరవింద్ స్వామినే ఎక్కువ స్టైలీష్‌గా కనిపిస్తున్నాడు. మెగా ఫ్యాన్స్‌కి ఇది మింగుడు పడని నిజమే అయినా. సినిమా అదే చాలా అత్యవసరం. కథానాయకుడి కంటే ప్రతినాయకుడు బలవంతుడిగా కనిపించడం తెలుగు సినిమాల్లో చూడడం అరుదైన సంగతి. ఆ లోపంతోనే.. చాలా కథలు బోల్తా పడుతున్నాయి. కానీ తని ఒరువన్ సంగతి వేరు. అందులో హీరో, విలన్ పాత్రలు నువ్వా నేనా అన్నట్టుంటాయి. ఈ కథకు ప్లప్ పాయింట్ అదే. అలా.. చరణ్‌కి సవాల్ చేసే పాత్రలో అరవింద్ స్వామి మళ్లీ చెలరేగిపోయాడని టాక్. తని ఒరువన్ కంటే.. ఈ సినిమాలో ఇంకా బాగా నటించడని.. సినిమా పూర్తయ్యాక కూడా అరవింద్ స్వామి పాత్ర వెంటాడుతుంటుందని, ధృవ ఫలితాన్ని నిర్దేశించింది ఆ పాత్రే అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే నిజమైతే ఆ క్రెడిట్ కూడా చరణ్‌కే వెళ్తుంది. ఎందుకంటే అరవింద్ స్వామి ని తన టీమ్‌లో చేర్చుకోవాలని ఎక్కువ పరితపించిందీ, పట్టుబట్టిందీ చరణే. ఒక విధంగా ఇదీ చరణ్ గెలుపే. ట్రైలర్ తో వచ్చిన ఆ కిక్… థియేటర్లోనూ కలిగితే… చరణ్ విజయాల లోటు తీరిపోవొచ్చు