ఎగ్జిట్ పోల్స్..! అదో బ్రహ్మపదార్థం..!

సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. ఇప్పుడు అందరి దృష్టి కౌంటింగ్ కన్నా… పోలింగ్ ముగిసిన రోజున.. వివిధ టీవీ చానళ్లు ప్రకటించే.. ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో మరింత ఎక్కువగా ఉంది. అసెంబ్లీ ఎన్నికలు కూడా జమిలీగా జరగడమే దీనికి కారణం. ఎగ్జిట్ పోల్స్‌లో ఫలితం కనిపించినంత మాత్రాన.. గెలుపొందుతారని ఎక్కడా లేదు. నిజం చెప్పాలంటే.. అలాంటి ఎగ్జిట్ పోల్స్ నిజమైనవి చాలా చాలా తక్కువ….!

పది వరకూ చెబితే ఏదో ఒకటి కాకపోదా..?

దేశంలో మీడియా సంస్థలన్నింటికీ.. విజేత ఎవరో ముందో చెప్పాలన్న తాపత్రయం ఉంది. అందుకే ఎన్నికల ప్రకటనకు ముందు.. పదిహేను రోజులకోసారి విజేతను ప్రకటించేవి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అని ట్యాగ్ లైన్ పెట్టేసి… సర్వే పేరుతో ఫలితాలు ప్రకటించేవి. వాటిని ఆయా పార్టీల అభిమానులు చూసుకుని సంతోషపడేవారు. మిగతా పార్టీల వాళ్లు.. అంతా ఫేక్ అనేవారు. అంతా కామన్‌గా సాగిపోతుంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా.. దాదాపుగా అంతే ప్రకటించే అవకాశం ఉంది. దేశంలో ఇప్పుడు మీడియా విస్తృతి పెరిగింది. పదుల సంఖ్యలో చానళ్లు ఉన్నాయి. అన్నీ.. ఒకటే చెప్పవు. వేర్వేరు ఫలితాలను ప్రకటిస్తాయి. అందులో ఏదో ఒకటి నిజం అవుతుంది. మిగతావన్నీ తప్పవుతాయి. ఆ ఒక్కటి అప్పటికి… క్రెడిబులిటి ఉన్న సర్వే. అంతకు ముందు అవే సంస్థలు ప్రకటించిన సర్వేలు.. బ్లండర్స్ అయి ఉంటాయి. కానీ చెప్పుకోవడానికి ఇప్పటి ఫలితాలు బాగుంటాయి. ఒకటి నుంచి పది వరకు ఉన్న అంకెల్లో.. తలా ఒకటి చెబితే.. ఎవరో ఒకరిది కచ్చితంగా నిజమవుతుంది కదా.. అదే లాజిక్ ను టీవీ చానళ్లు పాటిస్తున్నాయి.

మీడియాలన్నీ…ఏదో ఓ రాజకీయ పార్టీకి వత్తాసుగా మారినవే..!

జాతీయ మీడియా చానళ్లన్ని ఇప్పుడు… పార్టీల వారీగా విడిపోయాయి. తాము నమ్మిన పార్టీకి అడ్డగోలుగా మద్దతివ్వడమే కాదు.. వారికి కావాల్సినట్లుగా… సర్వేలను ప్రకటిస్తూ ుంటారు. అదంతా కామన్ గా జరుగుతున్న వ్యవహారమే. నిజంగా… సర్వేలు చేసే సంస్థలు కూడా.. తాము ఎవరికి సర్వేలు చేస్తున్నామో వారికే అనుకూలంగా చేసి ఇస్తున్నాయి. నిజంగా ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. తీసుకునేందుకు స్ట్రక్చర్ కూడా.. ఆయా సంస్థలకు ఉండటం లేదు. దీంతో.. ఎగ్జిట్ పోల్స్ విషయంపై … తమ అనుకూల ప్రేక్షకులను ఆకట్టుకుంటే చాలని… అవి నిజం అవ్వాల్సిన అవసరం లేదన్నట్లుగా.. ఆయా టీవీ చానళ్లు ఉన్నాయి. పైగా… అనేక టీవీ చానళ్లు… ఇలాంటి సర్వేల్లో ఫలితాలు ప్రకటించడానికి ప్యాకేజీలు కూడా మాట్లాడుకున్నాయి. ఆ విషయంలో.. గతంలో కోబ్రాపోస్ట్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో కూడా బయటపడింది.

గత ఎగ్జిట్ పోల్స్ చరిత్ర అంతా అధ్వాన్నమే..!

సార్వత్రిక ఎన్నికలు కానీ… వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కానీ.. వివిద సంస్థలు ఎప్పుడూ.. ఏకాభిప్రాయంగా… ఒకే ఫలితాలను ప్రకటించలేదు. యూపీలో బీజేపీకి అంత భారీ విజయం వస్తుందని ఒక్కరూ అంచనా వేయలేదు. గత ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ వస్తుందని.. అంచనా వేసిన సంస్థే లేదు. ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో… తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని.. ఒక్కటంటే.. ఒక్క న్యూస్ చానల్ కూడా చెప్పలేదు. కానీ.. ఫలితాలు వేరుగా వచ్చాయి. గత ఎన్నికల్లో ఏ ఒక్క ఇంగ్లిష్ మీడియా చానల్ అంచనా కూడా నిజం కాలేదు. టుడేస్ చాణక్య అంచనాలు మాత్రమే దగ్గరగా ఉన్నాయి. అయినప్పటికి.. ఆయా మీడియాలు చెప్ప ఎగ్జిట్ పోల్స్ పై అందరూ ఆసక్తిగానే ఉన్నారు. దానికి కారణం… గెలుపెవరిదనే ఉత్సుకత మాత్రమే..! దాన్నే సర్వే సంస్థలు.. మీడియా చానళ్లు క్యాష్ చేసుకుంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com