యాక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకొన్న హీరో అర్జున్. హీరోగా చాలా మంచి హిట్లు తన ఖాతాలో ఉన్నాయి. తెలుగు దర్శకులు ఆయనలో ఎమోషనల్ కోణాన్ని వెదికి తీసే ప్రయత్నం చేశారు. దర్శకుడిగా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశాడు అర్జున్. అయితే అవన్నీ యాక్షన్ కథలే. అయితే చాలా కాలం తరవాత ఇప్పుడు మళ్లీ మెగా ఫోన్ పట్టి ఓ సినిమా తీశారు అదే.. ‘సీతా పయనం’. యాక్షన్ కింగ్ తన ఇమేజ్ కి భిన్నంగా ఈసారి లవ్, ఎమోషనల్ స్టోరీని ఎంచుకోవడం విశేషం. అంతే కాదు.. తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ని ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నారు. నిజానికి తన కుమార్తెకు ఓ మంచి డెబ్యూ ఇవ్వాలన్న ప్రయత్నంతోనే ఈ సినిమాని మొదలు పెట్టారు అర్జున్.
దర్శకుడిగా తన మార్క్ చూపించుకోవడం అర్జున్‌కి ఒక టాస్క్ అయితే… తన కుమార్తెకు ఓ మంచి డెబ్యూ ఇవ్వడం మరో సవాల్. పైగా ఈరోజుల్లో ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి. వాళ్ల ఆశల్ని, ఆలోచనల్ని ఒడిసిపట్టుకోవడం అంత ఈజీ ఏం కాదు. అర్జున్ మినహాయిస్తే ఈ సినిమాలో ఎట్రాక్టీవ్ అంశాలు పెద్దగా కనిపించడం లేదు. నటుడిగానూ క్రౌడ్ ని పుల్ చేయాల్సిన బాధ్యత అర్జున్ పైనే పడింది. ఈ సినిమాలో ఆయన కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. నిజానికి ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకొందాం అనుకొన్నారు. డేట్లు కుదరక… అర్జున్ ఈ పాత్రని తానే చేయాల్సివచ్చింది. విజయ్ సేతుపతి గనుక చేసి ఉంటే ఇంకాస్త మైలేజీ వచ్చేది. ఈ వారం ‘సీతా పయనం’తో పాటు మరో రెండు సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. ఆ పోటీని సైతం ఈ సినిమా తట్టుకోవాల్సి ఉంటుంది. అర్జున్ ని అభిమానించే వాళ్లు తెలుగులోనూ ఉన్నారు. కాకపోతే వాళ్లు టికెట్ కొని మరీ థియేటర్లకు వస్తారా, లేదా అనేది చూడాలి.
