లిక్కర్ స్కాంలో సంచలనాత్మక అరెస్టులకు సమయం దగ్గర పడిందని సిట్ సంకేతాలు పంపుతోంది. ఇంత కాలం దుబాయ్ లో దాక్కున్న వ్యక్తిని రప్పించి.. ఎయిర్ పోర్టులో అరెస్టు చేసింది. వెంటనే డబ్బులు ఎక్కడ దాచి పెట్టారో కనుక్కుని శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్ నుంచి రూ.11 కోట్లు స్వాధీనం చేసుకుంది. ఇంకా పదకొండు మంది దుబాయ్, థాయ్ ల్యాండ్ నుంచి రావాల్సి ఉంది. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయకముందే వస్తే బెదరని ఆయా నిందితులకు సంకేతాలు పంపుతున్నారు.
ఎయిర్ పోర్టులో వరుణ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి.. విజయవాడ తరలిస్తున్నారు. వరుణ్ దగ్గర చాలా సమాచారం ఉంది. ఆధారాలను కూడా తీసుకు వచ్చారు. కీలక నేతలు.. వైసీపీ ముఖ్యులు ఈ లిక్కర్ స్కాంలో ఎలా ప్రధాన పాత్ర పోషించారో ఇప్పటికే ఆధారాలు ఉన్నాయి. వాటికి మరింత సపోర్టు ఇచ్చే ఆధారాలు వరుణ్ ఇచ్చిన సమాచారంతో వెలుగులోకి వచ్చాయి.
అంతిమ లబ్దిదారులు ఎవరు.. డిస్టిలరీస్ డబ్బులు ఎవరికి చేర్చాయి అన్నదానిపై స్పష్టత వచ్చింది. ఇప్పటి వరకూ మీడియాకు తెలిసింది కొంతేనని అసలు బయటపడిన విషయాలు మైండ్ బ్లాంక్ చేస్తాయని అంటున్నారు. అందుకే సిట్ అధికారుల నుంచి.. సంచలనాత్మక అరెస్టులకు సమయం అయిందన్న సంకేతాలు వస్తున్నాయంటున్నారు. మరికొన్ని డెన్స్ లో సోదాలు నిర్వహించి.. మరింత నగదు స్వాధీనం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.