పెద్ద నోట్లను రద్దు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం పట్ల ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మొదటి నుండి విముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఆరు నెలల ముందు నుండీ ఈ విషయమై ప్రభుత్వం తగు సన్నాహాలు చేస్తున్నా బ్యాంక్ లను అందుకు తగిన విధంగా సిద్ధం చేయక పోవడం వెనుక అదే కారణమని ప్రభుత్వంలో సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సహితం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారని తెలిసింది.
వాస్తవంగా ఈ ఆలోచన మాజీ కేంద్ర మంత్రి, బిజెపి రాజ్యసభ్యుడు డా. సుబ్రమణియన్ స్వామి నుండి వచ్చిన్నట్లు అని తెలుస్తున్నది. మొదటి నుండి ఆర్ధిక మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న ఆయనను దూరంగా ఉంచడంలో అరుణ్ జైట్లీ కీలక పాత్ర వహిస్తున్నారు. 2014 ఎన్నికలలో స్వామి కి న్యూఢిల్లీ సీట్ ఇవ్వలస్ని నరేంద్ర మోడీ, నితిన్ గడ్కరీ కలసి ప్రతిపాదించినా, ఏవిషయంలో కూడా కలవని అరుణ్ జైట్లీ, సుష్మ స్వరాజ్ కలసి తీవ్రంగా వ్యతిరేకించారు.
అందుకనే అప్పటి నుండి అవకాశం దొరికినప్పటల్లా మొదట రఘురాం రాజన్ పై, ఆ తరువాత ఆర్ధిక మంత్రిత్వ శాఖపై స్వామి విమర్శలు చేస్తూ వస్తున్నారు. రఘురాం రాజన్ కు జైట్లీ మద్దతు ఇవ్వగా, స్వామి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. స్వామి ని రాజ్యసభ కు నామినేట్ చేసే విషయం సహితం చివరి వరకు బయటకు పొక్కకుండా ప్రధాని జాగ్రత్త పడినట్లు తెలుస్తున్నది. ప్రధాని నుండి నైతిక మద్దతు లేకుండా గతంలో స్వామి జైట్లీ పై తీవ్ర విమర్శలకు దిగి ఉండేవారు కారని ఈ సందర్భంగా పలువురు భావిస్తున్నారు.
నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ నిర్ణయాన్ని అమలు జరపడంలో ఆర్ధిక మంత్రిత్వ శాఖ విఫలమైనదని స్వామి విమర్శించడం ఈ సందర్భంగా గమనార్హం. ఏ టి యం లలో రు 1000, రు 500 నోట్ల దామాషాను తగ్గించి, రు 100, రు 50 నోట్లను పెంచాలని, అందుకు అవసరమైన ఖర్చును తామే భరిస్తామని అంటూ రిజర్వు బ్యాంక్ అన్ని బ్యాంక్ లకు గత మే లో ఒకసారి, ఆ తరువాత జులై లో మరో సారి సర్కులర్ లను పంపింది. అయినా ఒక బ్యాంక్ కూడా ఈ దిశలో ఎటువంటి చర్య తీసుకోలేదు.
రిజర్వు బ్యాంక్ ఆదేశాలను బ్యాంక్ లు లెక్క చేయకుండా మౌనం వహించడం తీవ్రమైన విషయమే అయినా ఈ అంశాన్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఎవ్వరూ పట్టించు కోవడం లేదు. ఈ విషయమై ప్రతిపక్షాలకు కొంత `ఉప్పు’ అందించే విధంగా జైట్లీ వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు సహితం రాజకీయ వర్గాలలో ఇప్పుడు కలుగుతున్నాయి. దాదాపు ఎందరో ముఖ్యమంత్రులతో జైట్లీ కి వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉండటం గమనార్హం.
ఆర్ధిక మంత్రిగా తప్పని సరై నోట్ల రద్దును సమర్ధిస్తూ ప్రకటనలు చేస్తున్నా ప్రధాన మంత్రి వలే ఆవేశంగా మోడీ స్పందించక పోవడం ఈ సందర్భంగా పలువురు దృష్టిని ఆకర్షిస్తున్నది.