ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయడానికి భారీ కుట్ర జరిగినట్లుగా వీడియో వెలుగులోకి వచ్చింది. మద్యం తాగుతూ వీరు ప్లాన్ గురించి చర్చించుకుంటున్న వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో ఉన్న వారంతా రౌడీ షీటర్లే. వారంతా శ్రీకాంత్ పెంచి పోషిస్తున్న ముఠాలో కీలక సభ్యులు. శ్రీకాంత్ జైలు నుంచి ఇచ్చే ఆదేదశాలను.. అరుణ వీరికి చేరవేస్తుంది. నిజం చెప్పాలంటే.. అరుణనే వీరిని ఓ ముఠాగా నడుపుతోందన్న అనుమానాలు ఉన్నాయి.
జగదీష్, మహేష, వినీత్ అనే వ్యక్తులతో ఈ వీడియోలో కనిపించారు. వీరంతా పలు నేరాల్లో నిందితులు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. విచారణ ప్రారంభించారు. వీడియోలో ఉన్న వారిపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వీడియోను షూట్ చేసింది ఎవరు అన్నదానిపైనా విచారణ జరుపుతున్నారు. అరుణ సమక్షంలోనే ఈ కుట్ర జరిగిందా.. ఇంకెవరైనా ఉన్నారా అన్నది పోలీసులు తేల్చనున్నారు.
నిజానికి శ్రీకాంత్ కు పెరోల్ కోసం సిఫారసు చేసిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ విషయాన్ని ఆయన ఒప్పుకున్నారు కూడా. అయితే తన సిఫారసు లేఖ రిజెక్ట్ అయిందని అయన చెప్పారు. అయితే ఇప్పుడు ఆయననే ఈ ముఠా హత్య చేయాలనుకోవడం ఏమిటన్న ప్రశ్న వస్తోంది. కోటంరెడ్డిని హత్య చేస్తే డబ్బు వస్తుదంని మాట్లాడుకున్నారు.. ఎవరు ఇస్తారని.. బేరం పెట్టారన్న విషయం కూడా పోలీసులు తేల్చాల్సి ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.