2009లో వచ్చిన ‘అరుంధతి’ ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలామంది కెరియర్లు సెట్ చేసిన సినిమా అది. అనుష్కని స్టార్ గా మార్చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్ని భారీ బడ్జెట్ తో తీయొచ్చన్న భరోసాని కలిగించింది. ఇన్నాళ్లకు ఈ సినిమా హిందీలో రీమేక్ చేయబోతున్నారన్నది లేటెస్ట్ టాక్. అల్లు అరవింద్ ఈ సినిమాని బాలీవుడ్ కి తీసుకెళ్లబోతున్నార్ట. అనుష్క స్థానంలో శ్రీలీల కథానాయికగా నటిస్తుందన్నది ఓ టాక్.
‘అరుంధతి’ లాంటి కథలు టైమ్ లెస్. ఏకాలంలో అయినా ఆడేస్తాయి. పైగా ఇప్పుడు బాలీవుడ్ లో థ్రిల్లర్, హారర్ కథలకు మంచి గిరాకీ ఉంది. ఇలాంటి సమయంలో అరవింద్ ఈ ప్రాజెక్ట్ పట్టుకొన్నారు. కాకపోతే ‘అరుంధతి’ని ఉన్నది ఉన్నట్టు తీయకూడదు. ఈ కాలానికి తగ్గట్టుగా మార్పులు చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాని చాలాసార్లు చూసేశారు. డబ్బింగ్ వెర్షన్ లో హిందీ జనాలకూ చేరువైన కథ ఇది. వాళ్లకు ఇప్పుడు ఈ రీమేక్ కొత్తగా అనిపించకపోవొచ్చు. ‘ఛత్రపతి’ సినిమా కూడా ఇలానే చేశారు. ఆ సినిమా బాలీవుడ్ లో చాలా లేటుగా రీమేక్ చేశారు. అప్పటికే టీవీల్లో హిందీ డబ్బింగ్ చూసేసిన బాలీవుడ్ జనాలు, ఈ స్ట్రయిట్ హిందీ సినిమాని తిరస్కరించారు. అదే పొరపాటు ‘అరుంధతి’ విషయంలోనూ జరుగుతుందేమో అన్నది బెంగ.
పైగా శ్రీలీల హీరోయిన్ అయితే అంత ఇంపాక్ట్ ఉంటుందా? అనేది సందేహం. అనుష్క స్థానాన్ని శ్రీలీల మోగలగదు? అని చిత్రబృందం ఎలా నమ్ముతుందో అర్థం కావడం లేదు. తెలుగులో శ్రీలీల స్టార్ హీరోయిన్ కావొచ్చు. కానీ బాలీవుడ్ కి కాదు. ఆ పాత్రకి న్యాయం చేయగలదన్న కాన్ఫిడెన్స్ చిత్రబృందానికి ఎలా వచ్చిందో? మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారన్నది టాక్. ఆయన రీమేక్ కథల్ని బాగానే హ్యాండిల్ చేస్తారు. కాకపోతే.. శ్రీలీల, అరవింద్, మోహన్ రాజా… ఈ టీమ్ చూస్తే పక్కా సౌత్ ఫ్లేవర్ కొట్టేస్తుంది. దాన్ని బాలీవుడ్ ప్రేక్షకులు సౌత్ సినిమాగానే ట్రీట్ చేస్తారు. బాలీవుడ్ ప్రాజెక్ట్ అని ఎలా అనుకొంటారు? ఎందుకో అరవింద్ స్ట్రాటజీ ఈసారి కాస్త వీక్ గానే కనిపిస్తోంది.
