మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం అనూహ్య ఫలితాలను సాధిస్తూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో తన పట్టును నిరూపించుకుంటూ, ఈ ఎన్నికల్లో ఒక బలమైన శక్తిగా అవతరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎంఐఎం మొత్తం 95 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో 13 కార్పొరేషన్లలో ఆ పార్టీ అభ్యర్థులు గణనీయమైన విజయాన్ని నమోదు చేశారు.
ముఖ్యంగా ఛత్రపతి శంభాజీనగర్ గా పేరు మార్చిన ఔరంగబాద్, మలేగావ్ ప్రాంతాల్లో మజ్లిస్ జయభేరి మోగించింది. శంభాజీనగర్‌లో అత్యధికంగా 24 సీట్లు సాధించగా, మలేగావ్‌లో 20 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సైతం 8 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ తన ఉనికిని చాటుకుంది. అటు సోలాపూర్, ధూలే , నాందేడ్ కార్పొరేషన్లలో తలో 8 సీట్ల చొప్పున మొత్తం 24 స్థానాలను గెలుచుకుని ఆయా నగరాల పాలక వర్గాల్లో కీలక శక్తిగా ఎదిగింది.
విదర్భ , థానే ప్రాంతాల్లో కూడా ఎంఐఎం తన ప్రభావం చూపింది. అమరావతిలో 6, థానేలో 5, నాగపూర్‌లో 4 స్థానాలను కైవసం చేసుకోగా.. చంద్రపూర్‌లోనూ ఒక సీటును గెలుచుకుంది. కేవలం పరిమిత ప్రాంతాలకే పరిమితం కాకుండా, మహారాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తూ లౌకిక పార్టీల ఓటు బ్యాంకుకు గండి కొడుతోంది. మరాఠా గడ్డపై మజ్లిస్ సాధించిన ఈ పదిలమైన స్థానాలు భవిష్యత్తు అసెంబ్లీ సమీకరణాలను మార్చే అవకాశం కనిపిస్తోంది.
