ఇది వరకు నిర్మాతల్ని మేకర్లు అనేవారు. ఏ సినిమా ఎప్పుడు తీయాలో, ఏ కాంబినేషన్ ఎప్పుడు సెట్ చేయాలో వాళ్లకే బాగా తెలిసేది. ఇప్పుడు మేకర్లు కాదు.. జోకర్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. డబ్బులు పెట్టడం మినహా… నిర్మాత అనేవాడు చేయగలిగిందేం లేదు అనే స్థాయికి పడిపోయారు. అయితే ఇప్పటికీ మనక్కొంతమంది మేకర్లు కనిపిస్తున్నారు. తమ వ్యూహాలతో మ్యాజిక్ చేస్తున్నారు. అశ్వనీదత్ కూడా అలాంటి మేకరే. ఎన్నో సూపర్ కాంబినేషన్లని సెట్ చేసిన ఘనత దత్త్ది. ఇప్పుడు అలాంటి సూపర్ కాంబోల్ని సెట్ చేయడం మానలేదు. తాజాగా సావిత్రి కోసం ఆయన తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాడు. ఈ సినిమా నుంచి నిత్యమీనన్ని పక్కనపెట్టి సమంతని ఎంచుకోవడం వెనుక దత్ వ్యూహాలు చాలా ఉన్నాయి.
‘సావిత్రి’ బయోపిక్ ఆషామాషీ సినిమా కాదు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాకి ఎట్టిపరిస్థితుల్లోనూ గొప్ప క్రేజ్ వస్తుంది. వీలైతే హిందీ లోనూ విడుదల చేసే అవకాశాలున్నాయి. అందుకే… కాంబినేషన్ల విషయంలో దత్ చాలా జాగ్రత్తగా ఉన్నాడు. సావిత్రి కథ చెబుతున్నప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ల గురించి తప్పకుండా చర్చించాల్సిందే. వాళ్లు లేకుండా సావిత్రి కథ పూర్తవ్వదు. ఆ పాత్రల్లో జూనియర్, నాగచైతన్యలను తీసుకోవాలన్నది దత్ వ్యూహం. అయితే ఆయా పాత్రల్ని పోషించడానికి ఎన్టీఆర్, నాగచైతన్య సన్నద్దంగా లేకపోవడంతో.. దత్ ఆలోచనల్లో పడిపోయాడు. నిత్య ప్లేసులో సమంతని తీసుకొంటే, చైతూని ఒప్పించడం ఈజీ అవుతుంది. దానికి తోడు ఈ సినిమాకి ఓ స్టార్ డమ్ యాడ్ అవుతుంది. అందుకే… నిత్య ని సమంతతో రిప్లేస్ చేశారని తెలుస్తోంది. ఎన్టీఆర్ – సమంతలది హిట్ కాంబినేషన్. సమంతని చూసైనా సరే.. ఎన్టీఆర్ ‘ఓకే ‘ అనేస్తాడన్నది దత్ వ్యూహం. పైగా అక్కినేని పాత్ర చేయడానికి చైతూ ముందుకొచ్చినప్పుడు.. ఎన్టీఆర్ పాత్రలో కనిపించడానికి ఎన్టీఆర్ ధైర్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా.. సమంతని తీసుకురావడం వల్ల అటు చైతూనీ, ఇటు ఎన్టీఆర్నీ ఒప్పించడం సులభం అవుతుంది. అదీ… దత్ గారి వ్యూహ రచన. అదిరిపోయింది కదూ.