నియోజకవర్గాల పునర్విభజనతోయాభై శాతం అసెంబ్లీ సీట్లు ఎక్కువగా పెరగనున్నట్లుగా స్పష్టత వస్తోంది. దీంతో కూటమి పార్టీల్లోకి నేతల వలస పెరగనుంది. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన వారు.. సైలెంట్ గా ఉన్న వారు.. ఇంకా యాక్టివ్ గా ఉన్నా.. వైసీపీ ఇక కోలుకోవడం అసాధ్యమని నమ్మే వారంతా పోలోమని కూటమి పార్టీల్లో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే.. సీట్లు పెరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా తమకూ అవకాశం వస్తుందని వారు గట్టిగా ఆశలు పెట్టుకుంటారు. జగన్ రెడ్డి నాయకత్వం ఎప్పటికప్పుడు వినాశనానికే కానీ.. బాగుపడటానికి కాదని 90 శాతం వైసీపీ నేతలు నమ్ముతున్నారు. వీరంతా.. తలోదారి చూసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
వైసీపీ నేతల్లో కనిపించని నమ్మకం
ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై పార్టీ శ్రేణుల్లో నమ్మకం సడలుతోంది. 90 శాతం మంది నేతలు జగన్ మొండి వైఖరి వల్లే పార్టీ ఈ స్థితికి చేరిందని, భవిష్యత్తులో కోలుకోవడం అసాధ్యమని అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు పార్టీకి రాజీనామా చేయగా, మరికొందరు సైలెంట్ గా ఉంటూ కూటమి నేతలతో టచ్లోకి వెళ్తున్నారు. జగన్ రెడ్డి నాయకత్వం ఎప్పటికీ మారదని, అది వినాశనానికే దారితీస్తుందని నమ్మే వారంతా ఇప్పుడు తలోదారి వెతుక్కుంటున్నారు.
కూటమిలోకి భారీ క్యూ
నియోజకవర్గాల హద్దులు మారడం వల్ల పాత సమీకరణాలు పనిచేయవు. కొత్తగా ఏర్పడే స్థానాల్లో తమ సామాజిక వర్గం లేదా పట్టున్న ప్రాంతాలు కలిసి వచ్చేలా చూసుకోవడం కోసం నేతలు ఇప్పటి నుంచే కూటమి పార్టీల్లో చేరాలని ఫిక్సయ్యారు. వైసీపీలో ఉంటే భవిష్యత్తు శూన్యమని, అదే కూటమిలో చేరితే కొత్తగా వచ్చే సీట్లలో ఏదో ఒక చోట అవకాశం దక్కుతుందని వారు గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి రాజీనామా చేసిన వారు పోలోమని టీడీపీ లేదా జనసేన తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు.
నేతల్ని నిలుపుకోవడం జగన్కు కష్టమే
నియోజకవర్గాల పునర్విభజన అనేది కేవలం భౌగోళిక మార్పు మాత్రమే కాదు, అది వైసీపీని ఖాళీ చేసే ప్రక్రియగా మారబోతోంది. అధికార పార్టీకి ఉండే డీలిమిటేషన్ అడ్వాంటేజ్, పెరిగే సీట్లు.. ఈ రెండూ వెరసి వైసీపీ నేతలకు కూటమి పార్టీలు ఆకర్షణీయమైన వేదికలుగా కనిపిస్తున్నాయి. జగన్ ఒంటరి పోరాటం పార్టీని కాపాడుతుందో లేదో కానీ, డీలిమిటేషన్ మాత్రం వైసీపీ నుంచి భారీ వలసలకు రహదారిని వేయడం ఖాయంగా కనిపిస్తోంది.


