ఏపీ తరహాలో ఢిల్లీలో క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఐదు రూపాయలకు పేదల కడుపు నింపాలని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా నిర్ణయించారు. ఈ మేరకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ విషయాన్ని ప్రకటించారు. మొదటగా వంద చోట్ల ఏర్పాటు చేయడానికి ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేశారు. అటలు బీహారీ వాజ్పేయి పుట్టిన రోజున వీటిని ప్రారంభించే అవకాశం ఉంది.
నిరుపేదలు, విద్యార్థులు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులందరికీ ఈ ఐదు రూపాయల భోజనం అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఇప్పటికే ఏపీలో ఈ పథకం అమలవుతోంది. అన్న క్యాంటీన్ల పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజల ఆకలి తీరుస్తోంది. ఐదు రూపాయలకే భోజనం అందిస్తారు. ఒక్క పూట మాత్రమే కాకుండా మూడు పుటలా అందుబాటులో ఉంచుతున్నారు. ఇక కర్ణాటకలో ఇందిర క్యాంటీన్లు, తమిళనాడులో అమ్మక్యాంటీన్లు నడుస్తున్నాయి. తెలంగాణలో అన్నపూర్ణ పేరుతో గ్రేటర్ పరిధిలో అమలు చేస్తున్నారు.
పేదలకు ఐదు రూపాయలకు భోజనం అందించడం వల్ల.. వారికి ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, కూలీలు, ఆటో డ్రైవర్లు వంటి వారు భోజనం కోసం ఎక్కువ ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల వారికి కొంత ఆదా అవుతుంది. కుటుంబానికి ఉపయోగపడుతుంది. అందుకే ఇలాంటి పథకాలు ప్రారంభించడానికి ప్రభుత్వాలు ఆసక్తి చూపిస్తున్నాయి.