సనాతన ధర్మాన్ని కించ పరిచారని ఆరోపిస్తూ ఓ లాయర్ ఏకంగా చీఫ్ జస్టిస్ మీదనే దాడికి ప్రయత్నించడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనను అందరూ ఖండిస్తున్నారు. కానీ ఆ లాయర్ పై కేసు పెట్టలేదు. ఈ వివాదాన్ని పెద్దది చేయడం ఇష్టం లేక .. ఇలాంటి దాడులు న్యాయవ్యవస్థను ప్రభావితం చేయలేదని గట్టిగా సందేశం ఇచ్చేందుకు చీఫ్ జస్టిస్ గవాయ్ అత్యంత పరిణితితో వ్యవహరించారు. ఒక్క నిమిషం కోర్టు సమయాన్ని ఈ ఘటన కారణంగా వృధా కానివ్వలేదు. కానీ న్యాయవ్యవస్థపై జరుగుతున్న ఇలాంటి దాడులపై సమాజం అంతా దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది.
ప్రత్యక్ష దాడులు – ఓ ప్రమాదం
న్యాయవ్యవస్థపై ప్రత్యక్ష దాడులు పెను ప్రమాదంగా మారాయి. చీఫ్ జస్టిస్ పై దాడికి లాయర్ ప్రయత్నించడం అంటే చిన్న విషయం కాదు. అలాంటి ఆలోచన కూడా రాకూడదు. కానీ వచ్చింది. ప్రయత్నం చేశాడు కూడా. అత్యున్నత న్యాయస్థానంలోనే ఉఇలాంటి ఘటన జరిగింది. దిగువ కోర్టుల్లోనూ ఇలాంటి పరిణామాలు జరుగుతున్న సూచనలు అక్కడక్కడా బయటకు వస్తున్నాయి. ఆన్ లైన్ విచారణల్లో న్యాయమూర్తులను ఏ మాత్రం గౌరవించకుండా వ్యవహరిస్తున్న విధానం కూడా ఆందోళన కలిగించేదే.
పరోక్ష దాడులు – పెను ప్రమాదం
ప్రత్యక్ష దాడులకు తోడు.. పరోక్ష దాడులు కూడా న్యాయవ్యవస్థకు పెను సవాల్ గా మారాయి. కరుడు గట్టిన నేరస్తులుగా ముద్రపడిన వారు న్యాయవ్యవస్థపై దాడి చేస్తున్నారు. గతంలో కాబోయే చీఫ్ జస్టిస్ పై చేసిన కుట్రలు దేశం అంతా చూసింది. ఆ ఆరోపణల్లో నిజం లేదని తెలిసిన తర్వాత కూడా ఆ కుట్రలు చేసిన వారిపై చర్యలు లేవు. తీర్పు తమకు అనుకూలంగా వస్తే ఒకలా.. వ్యతిరేకంగా వస్తే మరోలా .. దాడి చేసేవారు చాలా మంది ఉన్నారు. కాబోయే చీఫ్ జస్టిస్ కుటుంబసభ్యులపై తప్పుడు కేసులు పెట్టి.. వారి వ్యక్తిగత వివరాలను తప్పుడు పద్దతుల్లో సేకరించి కుట్రలు చేసిన వారిని ఉపేక్షించారు. న్యాయవ్యవస్థతో ఆడుకుంటున్న వారూ అదే వ్యవస్థ నుంచి రక్షణ పొందుతున్నారు. ఇలాంటి దాడులు కూడా వ్యవస్థపై పెను ప్రభావం చూపుతున్నాయి.
కఠినంగా వ్యవహరిస్తేనే మరోసారి జరగవు!
ఏకంగా సీజేఐపై ప్రత్యక్షంగా దాడి చేసినా.. పరోక్షంగా తప్పుడు ప్రచారాల కోసం కుట్రలు చేసినా.. వారి కుటుంబసభ్యులను వేధించినా ఇదందా దాడుల కిందకే వస్తాయి. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే .. మరొకర్ని ప్రోత్సహించినట్లవుతుంది కానీ వారే తెలుసుకుంటారని అనుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇతర వ్యవస్థల కంటే న్యాయవ్యవస్థ భిన్నం. ఆ న్యాయ్యవస్థపై ఎప్పటికప్పుడు జరుగుతున్న దాడుల్ని .. విశ్వసనీయత ద్వారానే తిప్పికొట్టాలి. దాడులు చేసే వారికి సరైన బుద్ది చెప్పాల్సిన ఉంది