ఇన్ఫోసిస్ కంపెనీ బెంగళూరు సమీపంలోని అత్తిబెలెలో ఉన్న తన 28 ఎకరాల ప్రైమ్ ల్యాండ్‌ను ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ పుర్వంకర కు సుమారు 250 కోట్ల రూపాయలకు అమ్మేసింది. ఇది ఇన్ఫోసిస్ సొంత భూమి అయితే ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు కానీ.. ఈ భూమిని ప్రభుత్వం నుంచి పొందింది. దశాబ్దాల క్రితం కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి మండలి ద్వారా ప్రభుత్వం కేటాయించింది. కానీ అక్కడ నిర్మాణాలు చేపట్టలేదు.
సాధారణంగా సాఫ్ట్వేర్ కంపెనీలు తమ క్యాంపస్‌లను విస్తరించడానికి, ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ఇలాంటి భూములను రాయితీ ధరలకు లేదా పారిశ్రామిక అవసరాల కోసం కేటాయిస్తుంది. ఇన్ఫోసిస్ కూడా తన ఐటి కార్యకలాపాలను విస్తరించే ఉద్దేశంతోనే ఈ భూమిని పొందింది. ఇలాంటి భూముల్లో నిర్ణీత కాలపరిమితిలోగా అక్కడ పరిశ్రమను లేదా సాఫ్ట్వేర్ పార్కును నెలకొల్పాలి. భూమిని ఇతర వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. ఒకవేళ కంపెనీ ఆ భూమిని ఉపయోగించుకోలేకపోతే, దానిని తిరిగి ప్రభుత్వానికే అప్పగించాలి. కానీ, ఇన్ఫోసిస్ ఆ భూమిని అభివృద్ధి చేయకుండా, భారీ లాభానికి ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్‌కు విక్రయించడం నిబంధనల ఉల్లంఘన అనే విమర్శలు వస్తున్నాయి.
పుర్వంకర సంస్థ ఈ భూమిని తన అనుబంధ సంస్థ ప్రొవిడెంట్ హౌసింగ్ ద్వారా కొనుగోలు చేసింది. ఇక్కడ వారు భారీ నివాస సముదాయాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల కోసం ఇచ్చిన భూమి లాభం కోసం అమ్మడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఇన్ఫోసిస్ తమకు ఈ భూమిని పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు ఉన్నాయని వాదిస్తోంది. కేటాయింపు పత్రాల్లో విక్రయించే హక్కు ఉంటేనే వారు ఇలా చేయగలరు. కానీ, నైతికంగా ఇది ప్రభుత్వ ప్రోత్సాహకాలను దుర్వినియోగం చేయడమేనని విపక్షాలు , సామాజిక కార్యకర్తలు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.