ఈమధ్య కామన్ గా వినిపిస్తున్న మాట ‘థియేటర్లకు జనం రావడం లేదండీ’ అనే. ఓ వైపు ఓటీటీల హవా పెరిగిపోయింది. మరోవైపు ప్రేక్షకులకు కావల్సినంత ఎంటర్టైన్మెంట్ మెబైల్స్ ఇచ్చేస్తున్నాయి. ఐపీఎల్ తో తలనొప్పి ఎప్పుడూ వుంది. అందుకే సినిమాలు చూడాలనుకొనే మూడ్ లేదని అందరూ సింగిల్ లైన్లో ఆడియన్ పల్స్ డిసైడ్ చేసేస్తున్నారు. కానీ ‘ఓ మంచి సినిమా వస్తే ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి సిద్దంగా ఉన్నారు’ అనే విషయం ‘హిట్ 3’తో నిరూపితమైంది. నాని హీరోగా నటించిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రతీ థియేటర్ ముందూ ‘హౌస్ ఫుల్’ బోర్డులు కనిపించాయి. ప్రతీ ఏరియాలోనూ థియేటర్ల సంఖ్య షో.. షోకి పెరుగుతూ వెళ్లింది. బుక్ మై షో యాప్ అంతా ఆరెంజ్ రంగు పులుముకొంది. ఇలాంటి వాతావరణం చూసి చాలాకాలమైంది.
నాని కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చుకొన్న సినిమా ఇది. ఆ అంకె ఎంతో చిత్రబృందమే ప్రకటించాల్సివుంది. సంక్రాంతి సీజన్ తరవాత థియేటర్ల దగ్గర ఇంత క్రౌడ్ చూడలేదు. ఇదంతా నాని చేసిన ప్రమోషన్, ఈ సినిమాకు వచ్చిన బజ్ వల్లే. ‘హిట్ 3’ చూడాలి అనే విషయం జనాలు ముందే ప్రిపేర్ అయిపోయారు. మే 1 సెలవుదినం కావడం మరింత కలిసొచ్చింది. ఐపీఎల్ వల్ల నైట్ షోలకు జనం ఉండడం లేదన్నది కామన్ గా వినిపించే కామెంట్. అయితే నిన్న (గురువారం) నైట్ షోలన్నీ హౌస్ ఫుల్లే. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ‘హిట్ 3 కేవలం యూత్ కే. మహిళలు ఈ సినిమా చూడరు’ అనుకొన్నారు. కానీ వాళ్లు ఎప్పటిలానే నాని సినిమాకి క్యూ కట్టారు. మార్నింగ్ షోలలో సైతం వాళ్ల జోరు కనిపించింది.
‘హిట్ 3’ రిజల్ట్ వల్ల ఒక్క విషయం మరోసారి బలంగా నిరూపితమైంది. సినిమాకు క్రేజ్ తీసుకురావడం ముఖ్యం. ‘ఈ సినిమా చూడాల్సిందే..’ అని ప్రేక్షకుల దృష్టి సినిమా వైపు మరల్చడం ముఖ్యం. టీజర్, ట్రైలర్, ప్రమోషన్ కంటెంట్ తో జనాల్ని ఆకర్షించడం ముఖ్యం.. ఇవన్నీ జరిగితే ఆటోమెటిగ్గా జనాలు వస్తారు. నాని చేసింది అదే. ఇంతకాలం జనాలు థియేటర్లకు రావడం లేదంటే కారణం మంచి సినిమాలు లేకే. ఇస్తే తప్పకుండా వస్తారు. దానికి ‘హిట్ 3’ తాజా ఉదాహరణ.