జూలై నెల కళ తప్పింది. ఒక్క విజయం కూడా లేకుండా భారంగా జారింది. ఇప్పుడు ఆశలన్నీ ఆగస్ట్ పైనే. వందల కోట్ల బడ్జెట్‌తో తయారైన సినిమాలు ఆగస్ట్ బరిలో దిగుతున్నాయి. ఒక్కసారి వివరాల్లోకి వెళితే…
ఆగస్ట్ 1న విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ ‘సార్ మేడమ్’తో వచ్చారు. ఇదొక తమిళ్ డబ్బింగ్ సినిమా. ఆల్రెడీ తమిళ్లో గత వారం విడుదలై డీసెంట్‌గా ఆడింది. అయితే తెలుగులో ప్రమోషన్స్ సరిగ్గా లేవు. ఇలాంటి సినిమా ఒకటి వస్తుందని కూడా చాలా మందికి తెలీదు. కాకపోతే విజయ్ సేతుపతి సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు ఓ మోస్తారు వినోదాన్ని అందించే సినిమానే ఇది.
ఆగస్ట్ రెండో వారంలో కమెడియన్ ప్రవీణ్, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’ వస్తోంది. చిన్న సినిమా ఇది. కాన్సెప్ట్, కామెడీ పండితేనే నిలబడుతుంది. ఆగస్ట్ 9న మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా వుంటుంది. ‘అతడు’ సినిమాని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా రిపీట్ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆగస్ట్ 9న థియేటర్స్‌లో చాలా రీక్రియేషన్స్ చూడొచ్చు.
ఈ ఏడాది ఎంతగానో ఎదురు చూస్తున్న రెండు చిత్రాలు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. రజనీకాంత్ ‘కూలీ’, హృతిక్, ఎన్టీఆర్ ‘వార్ 2’. బాక్సాఫీసు ఆశలన్నీ ఈ రెండు సినిమాల పైనే వున్నాయి.
‘కూలీ’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం. నాగార్జున, ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, పూజా హెగ్డే ఇలా బోలెడు స్టార్ ఎట్రాక్షన్ వుంది. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై అంచనాలని భారీగా పెంచాయి. ట్రైలర్‌తో ఆ అంచనాలు మరో స్థాయికి చేరడం ఖాయం.
‘వార్ 2’ ట్రూ పాన్ ఇండియన్ సినిమా. ఎన్టీఆర్, హృతిక్ స్క్రీన్ షేర్ చేసుకోవడం మేజర్ అట్రాక్షన్. ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడం, ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్ ప్రొడక్షన్‌తో కలసి వర్క్ చేయడంతో ఈ మల్టీ స్టారర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యశ్‌రాజ్ ఫిల్మ్స్ మామూలు సంస్థ కాదు. ‘వార్’ ఫ్రాంచైజ్ ఒక ఫ్యాన్ బేస్ వుంది. ఇప్పుడీ యూనివర్స్‌లో ఎన్టీఆర్ అడుగుపెట్టారు. ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి. ఈ సినిమా కూడా 14నే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రెండు సినిమాలు అంచనాలకు తగ్గట్టుగా ఆడితే మాత్రం బాక్సాఫీసు కరువు తీరిపోతుంది.
ఆగస్ట్ మూడో వారంలో రెండు చిన్న సినిమాలు వున్నాయి. అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’ అనే లేడీ సెంట్రిక్ సినిమా చేసింది. హీరో నరేష్ అగస్త్య ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’ అనే లవ్ స్టోరీ చేశాడు. ఈ రెండు కూడా 22నే వస్తున్నాయి. అప్పటికే ‘కూలీ’, ‘వార్ 2’ చిత్రాల వేడి ఇంకా వుంటుంది. ఇలాంటి నేపధ్యంలో ఈ చిన్న సినిమాలు ఎంతలా ప్రేక్షకులను ఆకర్షిస్తాయో చూడాలి.
వినాయక చవితికి రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి. రవితేజ ‘మాస్ జాతర’ని 27న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. నాగవంశీ నిర్మాత. ఈ సినిమా వస్తే గనుక వినాయక చవితి కలిసొచ్చే ఛాన్స్ వుంది. నారా రోహిత్ ‘సుందరకాండ’తో అదే డేట్‌కి వస్తున్నాడు. ‘భైరవం’ సినిమా ఆయనకి కలిసిరాలేదు. ఇప్పుడు సోలో రిలీజ్‌పై నమ్మకంగా వున్నారు.
మొత్తానికి ఆగస్ట్‌లో పెద్ద, మీడియం, చిన్న… అన్ని రకాల సినిమాలు కనిపిస్తున్నాయి. అయితే ‘కూలీ’, ‘వార్ 2’పై గంపెడు ఆశలు వున్నాయి. మరి బాక్సాఫీసు వద్ద ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో చూడాలి.