2025 లో మరో నెల జారిపోయింది. ఆగస్ట్ కూడా తెలుగు చిత్రసీమకు ఎలాంటి ఊరట అందించలేకపోయింది. ఈ నెలలోనూ పరాజయాల పరంపర కొనసాగింది. ముఖ్యంగా భారీ అంచనాలతో వచ్చిన `వార్ 2`, `కూలీ` చిత్రాలు నిరాశ పరిచాయి. చిన్న సినిమాల్లో మెరుపులు కరువయ్యాయి. వారానికి నాలుగైదు సినిమాలు వచ్చినా… ఒక్కటీ బాక్సాఫీసు మెప్పు పొందలేకపోయింది.
ఆగస్టు మొదటి వారంలో ‘థ్యాంక్యూ డియర్’, ‘బాలు గాడి లవ్ స్టోరీ’, ‘బకాసుర రెస్టారెంట్’ వచ్చాయి. అసలు ఇలాంటి ఇనిమాలు వచ్చాయన్న సంగతి కూడా ప్రేక్షకులకు తెలియకుండా పోయింది. ఆగస్టు 14న వార్, కూలీ రెండూ ఢీ కొట్టాయి. రెండూ పెద్ద సినిమాలే. క్రేజ్ ఉన్న ప్రాజెక్టులే. దానికి తగ్గట్టుగానే ప్రారంభ వసూళ్లు అదిరాయి. కానీ సినిమాల్లో స్టఫ్ లేకపోవడం వల్ల ఆ వసూళ్లు నిలకడగా ఉండలేకపోయాయి. వార్ 2 బయ్యర్లు చాలా వరకూ నష్టపోయారు. కూలీ వల్ల కూడా నష్టాలొచ్చాయి. అయితే ‘వార్ 2’కి ఎక్కువ డామేజీ జరిగింది.
అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’ వేసుకొని వచ్చినా జనాలు చూడలేదు. దర్శకుడు మంచి థీమ్ ని ఎంచుకొన్నా… దాన్ని ప్రేక్షకులు ఆస్వాదించేలా చెప్పలేకపోయాడు. అనుపమ పడిన కష్టం వృథా అయ్యింది. మేఘాలు చెప్పిన ప్రేమకథ, కన్యాకుమారి విడుదలకు ముందు కాస్త హడావుడి చేశాయి. కానీ విషయం లేకపోవడం వల్ల తేలిపోయాయి. ఆగస్ట్ చివరి వారంలో కూడా సినిమాల జోరు కనిపించింది. బార్బరిక్, అర్జున్ చక్రవర్తి, సుందరకాండ విడుదల అయ్యాయి. సుందర కాండకు మంచి రివ్యూలు వచ్చాయి. కానీ దురదృష్టం కొద్దీ.. ఈ సినిమాకు కలక్షన్లు కనిపించలేదు. మిగిలిన సినిమాలూ అదే దారి పట్టాయి.
ఆగస్టులో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా టాలీవుడ్ ఖాతాలో కనిపించకుండా పోయింది. నిజంగానే నిర్మాతలకు, బయ్యర్లకు నష్టాల్ని మిగిల్చిన నెల ఇది. ఇందులోంచి తేరుకోవాలంటే సెప్టెంబరులో అనూహ్యమైన విజయాలు చూడాలి.