భారత్ నుంచి రొయ్యల దిగుమతులపై ఆ 8 ఏళ్ల నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికా టారిఫ్‌ల కారణంగా ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఎగుమతిదారులకు ఇది భారీ ఊరటనిచ్చే అంశం. నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించి నిషేధం ఎత్తివేసేలా చూశారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. భారత రొయ్యలకు మొదటి దిగుమతి అనుమతి లభించింది అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఆస్ట్రేలియాకు రొయ్యల మొదటి లాట్‌కు షరతులతో అనుమతి ఇచ్చింది. 2017 జనవరిలో భారత్ నుంచి వచ్చిన కొన్ని లాట్లలో వైట్ స్పాట్ వైరస్ ( గుర్తించిన తర్వాత ఆస్ట్రేలియా రొయ్యల దిగుమతులపై నిషేధం విధించింది. అప్పటి నుంచి 8 ఏళ్లుగా కొనసాగిన ఈ నిషేధం ఇప్పుడు ముగిసింది. ఈ అనుమతి భారత్ రొయ్యల ఎగుమతులకు కొత్త మార్కెట్‌ను తెరుస్తుంది.
భారత్‌లో రొయ్యల ఎగుమతుల్లో 80 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది. ఇందులో 70 శాతం అమెరికాకు ఎగుమతి అవుతుంది. అయితే, ట్రంప్ విధించిన 59.72 శాతం టారిఫ్‌లు ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ సమయంలో ఆస్ట్రేలియా మార్కెట్ తెరుచుకోవడం ఎగుమతిదారులకు ఊరటనిచ్చే అంశం. రొయ్యలు ఆర్గానిక్ గా పండించినవి… వైట్ స్పాట్ వైరస్ లేకుండా ఉన్నవే దిగుమతి చేసుకుంటారు.