ఏపీ ప్రజల రక్తమాంసాలు పీల్చిన లిక్కర్ స్కామ్ నిందితుల ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. మొదటగా .. ఏ 1 నిందితుడు రాజ్ కేసిరెడ్డికి చెందిన రూ. 13 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయాలని ఏసీబీ కోర్టులో ప్రపోజల్స్ దాఖలు చేశారు. ఇందులో పది కోట్ల వరకూ వివిధ రకాల ఆస్తులు.. మరో మూడు కోట్ల రూపాయలు బ్యాంకులో ఉన్న నగదు. ఇవన్నీ లిక్కర్ స్కామ్‌లో భాగంగా వచ్చిన డబ్బులతో కొన్న ఆస్తులు, నగదు. ఈ కారణంగానే వాటిని జప్తు చేయాలని నిర్ణయించారు.
ఇతర నిందితులు కూడా లిక్కర్ స్కామ్‌తో కొనుగోలు చేసిన ఆస్తులను జప్తు చేయడానికి తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అరెస్ట్ అయిన నిందితుల్లో పలువురు లిక్కర్ కేసు డబ్బులతోనే హైదరాబాద్‌లో ఇళ్ల స్థలాలు, విల్లాలు కొన్నట్లుగా గుర్తించారు. వాటిపై తదుపరి ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే పలు చోట్ల సోదాలు చేసి.. నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఫామ్ హౌస్‌లో దాచి ఉంచిన రూ. 11 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. లిక్కర్ కేసులో కొన్ని కీలకమైన పరిణామాలు ముందు ముందు జరగనున్నాయి.
ఇప్పటికే రెండు చార్జిషీట్లను సిట్ అధికారులు కోర్టులో నమోదు చేశారు. అసలు ప్రదాన సూత్రధారి, ఆయనకు అందిన డబ్బులు, బంగారం గురించి బయటకు తీయాల్సి ఉంది. వాటిపై సిట్ అధికారులు పక్కా సమాచారంతో ఉన్నారని.. సరైన సమయంలో.. ఇవన్నీ బయట పెట్టి ప్రధాన లబ్దిదారుల్ని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.