దర్శకులుగా మారిన హాస్యనటులు హిట్లు కొట్టిన దాఖలాలు టాలీవుడ్లో లేవు. అయితే ఆ ట్రెండ్ మార్చాడు అవసరాల శ్రీనివాస్. ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా మారి.. ఓకే అనిపించుకొన్నాడు. జ్యో అచ్యుతానందతో మరోసారి ఆకట్టుకొని డీసెంట్ డైరెక్టర్ అనిపించుకొన్నాడు. ఇప్పుడు అవసరాలకు ఓ బంపర్ ఆఫర్ దక్కింది. సురేష్‌ప్రొడక్షన్స్ నుంచి అవసరాలకు పిలుపు వచ్చింది. `వెంకీతో సినిమా చేస్తావా` అంటూ ఆఫర్ అందింది. దాంతో అదిరిపడ్డాడు అవసరాల. ఇది నిజంగా ఊహించని పిలుపే. అప్పటికప్పుడు తన దగ్గరకున్న ఓ లైన్ చెప్పి ఓకే అనిపించుకొని సింగిల్ సిట్టింగ్‌లో చేతులు కలిపేశారు.
అయితే.. నానితో ఓ సినిమా చేయనున్నాడు అవసరాల శ్రీనివాస్. 2017లో అది పట్టాలెక్కుతుంది. ఈ గ్యాప్‌లో వెంకీతో సినిమా చేయడం కష్టం. ఎందుకంటే వెంకీ గురు సినిమాతో బిజీగా ఉన్నాడు. దానికి తోడు అవసరాల దగ్గర స్క్రిప్టు కూడా రెడీగా లేదు. ఈగ్యాప్‌లో కథని పూర్తి స్థాయిలో సిద్దం చేసుకొంటానంటున్నాడు అవసరాల శ్రీనివాస్. ముందు నాని సినిమా పూర్తి చేశాక, ఆ తరవాత వెంకీతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. నానితో సినిమాని వారాహి సంస్థ తెరకెక్కించే అవకాశం ఉంది. వెంకీ – అవసరాల కాంబోకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.