ప్రజాసమస్యలను గుర్తించడం ఓ కళ. అలాంటి కళ అందరికీ రాదు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి లాంటి వాళ్లకు అది ప్రత్యేకం. ఆయన పార్లమెంట్ లో లేవనెత్తే అంశాలు ప్యూర్ గా ప్రజలకు సంబంధించినవే ఉంటాయి. అది కూడా సామాన్య ప్రజలకు. దానికి తాజా ఉదాహరణ ఆయన పార్లమెంట్ లో ప్రస్తావించిన తాజా అంశం. నాటు కోళ్ల ధరలు మటన్ కంటే ఎక్కువ అయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ… పార్లమెంట్ లో ప్రసంగించారు. నాటు కోళ్లు తినాలనుకునే వారికి ఎంత బాధ ఉందని ఆయన ఈ అంశాన్ని పార్లమెంట్ వరకూ తీసుకెళ్తారు…?
నాటు కోడి మాంసం తినాలనుకున్నవారు ధర తక్కువ అని మటన్ తిని బతికేస్తున్నారని అవినాష్ రెడ్డి ఆవేదన కావొచ్చు. ఇలా నాటు కోడి ధరలు మటన్ కంటే ఎక్కువ కావడం వెనుక కుట్ర ఉందన్న అనుమానం కూడా మన కడప ఎంపీ గారు వ్యక్తం చేశారు. నాటు కోడిపై కుట్ర చేయడం అంటే చిన్న విషయం కాదని ఆయన భావన. అవినాష్ రెడ్డి ఆవేదనపూరిత ప్రసంగం, లేవనెత్తిన సమస్యను చూసి కేంద్ర మంత్రి కూడా స్పందించారు. నాటు కోళ్లకు ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా కేంద్రం తరపున ఏమైనా సహకారం అందించగలిగితే అందిస్తామని హామీ ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వంతో స్పందించి ఆయన వెంటనే ధరల విషయం తెలుసుకుని అవినాష్ రెడ్డికి ఊరట కల్పించే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్లో నాటు కోళ్ల ధరలు 500 రూపాయలు ఉంటే.. మటన్ ధరలు 900 రూపాయల వరకూ ఉన్నాయని… గుర్తించామని చెప్పారు. అంటే నాటుకోళ్ల ధరలు మటన్ ను మించిపోలేదని బాధపడకండని చెప్పారు. దీన్ని బట్టి అర్థమయిందేమిటంటే.. అవినాష్ రెడ్డిని ఎవరో నాటు కోళ్ల వ్యాపారి మోసం చేశాడు. ఆయన ఇంట్లోకో.. విందుకో నాటుకోళ్లను కొనుగోలు చేసినప్పుడు మటన్ రేటు కంటే ఎక్కువ వసూలు చేశాడు. దాంతో సామాన్య ప్రజల బాధలు ఆయన అనుభవించాల్సి వచ్చింది. వెంటనే పార్లమెంట్ లో ప్రస్తావించారు. ఎంతైనా ప్రజల పట్ల కనీస బాధ్యత కలిగిన ఎంపీ కదా!
