జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే టిక్కెట్ తనకు కాకుండా చేస్తున్నారని .. తనకు సోనియా, రాహుల్ ఆశీస్సులున్నాయని ఇటీవల అజహరుద్దీన్ చెప్పారు. అది ఆషామాషీగా కాదని నేరుగా ఢిల్లీ వెళ్లి వాళ్లతో సమావేశమై ఆ ఫోటోలను విడుదల చేశారు. సోనియా గాంధీ ఇటీవలి కాలంలో రాజకీయ సమావేశాలు అతి తక్కువగా నిర్వహిస్తున్నారు. ఇలా టిక్కెట్ల కోసం వచ్చే వారిని అసలు కలవడం లేదు. కానీ అజహరుద్దీన్ అంటే సోనియాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే కలిశారు. తర్వాత రాహుల్ తోనూ అజహర్ భేటీ అయ్యారు.
అజహరుద్దీన్ దూకుడు చూస్తూంటే ఆయన టిక్కెట్ ఖరారు చేసుకొచ్చేశారని అనుకోవాలి. ఇప్పటికి జూబ్లిహిల్స్ నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించారు. దానికి కౌంటర్ గా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ టిక్కెట్ హైకమాండ్ ఖరారు చేస్తుందని ఎవరూ అలా ప్రకటించుకోవద్దని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇక తాను చెప్పుకోవడం ఎందుకని.. .ఢిల్లీ నుంచే పనులు చక్క బెట్టేస్తున్నారు అజహరుద్దన్. గత ఎన్నికల్లో జూబ్లిహిల్స్ నుంచి అజరుద్దీనే పోటీ చేశారు. చివరి క్షణంలో టిక్కెట్ ఖరారు చేశారు.
అయితే గత ఎన్నికల్లో మజ్లిస్ మద్దతు బీఆర్ఎస్ పార్టీకి ఉండటంతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ వరుసగా మూడో సారి ఎన్నికయ్యారు. కానీ ఆయన అనారోగ్యంతో మృతి చెందడంతో ఇప్పుడు ఉపఎన్నిక తప్పడం లేదు. ఈ ఉపఎన్నికలో సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోలేకపోతే పార్టీ పరిస్థితి దిగజారుతుందని కేటీఆర్ భయపడుతున్నారు. అధికారంలో ఉండి గెలవలేకపోతే వ్యతిరేకత పెరుగుతోందని అనుకుంటారని రేవంత్ అనుకుంటున్నారు . అందుకే ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.