వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి సంధించిన విమర్శలు ప్రస్తుతం కడప రాజకీయాల్లో పెను సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి కుటుంబ ఆస్తుల గొడవపై రాచమల్లు చేసిన వ్యాఖ్యలు.. ఆయన కుటుంబంలో పరిస్థితులకు అన్వయిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇతరుల కుటుంబాల గురించి నీతులు చెప్పే ముందు, సొంత ఇంట్లో జరిగిన అన్యాయాల గురించి సమాధానం చెప్పాలని రాచమల్లును డిమాండ్ చేశారు.
ఈ వివాదంలో ప్రధానాంశం రాచమల్లు పెద్ద కుమార్తె వివాహం. ఇటీవల రాచమల్లు తన చిన్న కుమార్తె వివాహాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. కానీ పెద్ద కుమార్తెను పిలవలేదు. దీనికి కారణం ఒక బీసీ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే. ఒప్పుకోకపోతే తన జీవితం తాను జీవిస్తానని పెద్ద కూతురు తేల్చిచెప్పడంతో.. రాజకీయంగా పరువు పోకుండా ఉండటానికి రాచమల్లు పెద్ద కుమార్తె పెళ్లిని రిజిస్టర్ ఆఫీసులో పూర్తి చేశారు. తర్వాత తన కుమార్తెతో సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడు కనీసం చిన్న కూతురు పెళ్లికి పెద్ద కూతుర్ని పిలవలేదు. ఇదే విషయాన్ని బీటెక్ రవి హైలెట్ చేస్తున్నారు. . ఒకవైపు బీసీల పక్షపాతి అని చెప్పుకుంటూనే ఆమెను కుటుంబం నుంచి వెలివేసి, తరిమేయడం రాచమల్లు ద్వంద్వ నీతికి అద్దం పడుతోందని ప్రజల ముందు పెడుతున్నారు.
అంతే కాదు జగన్ అడిగితే ప్రాణం ఇస్తాను అని రాచమల్లు చేసిన ప్రకటనపై కూడా బీటెక్ రవి సెటైర్లు వేశారు. 2009 ఎన్నికల్లో ఇదే జగన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన చరిత్ర రాచమల్లుదని, అప్పుడు ప్రాణాలు తీస్తామన్న వ్యక్తి ఇప్పుడు ఇస్తాననడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. సొంత రక్తం పంచుకు పుట్టిన బిడ్డనే కులం పేరుతో దూరం పెట్టి, ఇంట్లోకి రానివ్వని వ్యక్తి.. ఇప్పుడు జగన్ కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల పంపకాల గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు.
రాచమల్లు ప్రసాద్ రెడ్డి తన వ్యక్తిత్వాన్ని , కుటుంబ విలువలను తాకట్టు పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారనే అంశాన్ని టీడీపీ నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఒక తండ్రిగా తన బిడ్డ పట్ల కనికరం చూపని వ్యక్తి.. కుటుంబ విలువల గురించి మాట్లాడుతూండటం హాట్ టాపిక్ గా మారింది.


