ఏప్రిల్ 28…. తెలుగు సినీ ప్రపంచం, యావత్ భారతీయ చలన చిత్రసీమ ఈ డేట్‌పై ఫోకస్ పెట్టింది. దానికి కారణం… బాహుబలి, ది కన్‌క్లూజన్ సినిమా ఆరోజే విడుదల అవుతోంది. బాహుబలి ది బిగినింగ్ సాధించిన రికార్డులన్నీ ఈ సినిమానే బ్రేక్ చేస్తుందని సినీ అభిమానులు నమ్ముతున్నారు. బాహుబలి కంటే 30 శాతం అధిక వసూళ్లను బాహుబలి 2 సాధిస్తుందని చిత్రబృందం కూడా నమ్మకంగా చెబుతోంది. బాహుబలి 2 స్టామినా ఎంత? అనేది ఏప్రిల్ 28నే తేలబోతోంది. అయితే ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 28 కంటే ముందే.. ఈ సినిమా బయటకు వచ్చేసే ఛాన్సుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
బాహుబలి 2ని ఏప్రిల్ 28న విడుదల చేస్తామని, కొన్ని నెలల క్రితమే రాజమౌళి ప్రకటించాడు. అయితే ఇప్పుడు ఈ డేట్ మార్పిడి విషయంలో రాజమౌళి అండ్ కో తర్జన భర్జనలు పడుతున్నారని తెలుస్తోంది. దానికి కారణం.. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన కొన్ని దృశ్యాలు లీక్ అవ్వడమే. సినిమా షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 2017 జనవరికల్లా ఫస్ట్ కాపీ కూడా చేతికి వచ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి, మార్చిలలో ప్రమోషన్లు భారీగా చేయాలని చిత్రబృందం భావిస్తోంది. సినిమా పూర్తయి, ఫస్ట్ కాపీ చేతిలో ఉన్నప్పుడు సినిమాని దాచుకోవడం కంటే, విడుదల చేసేయడమే బెటర్ అన్నది రాజమౌళి అండ్ టీమ్ అభిప్రాయం. లీకేజీల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు వీలైనంత త్వరగా విడుదల చేయడమే మంచిదని, ఏప్రిల్ 28కి కనీసం రెండు మూడు వారాల ముందే బాహుబలిని తీసుకొస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నార్ట. అయితే అదంత సులభం కాకపోవొచ్చు. ఎందుకంటే బాహుబలి 2 కేవలం టాలీవుడ్‌నే కాదు, బాలీవుడ్ నీ టార్గెట్ చేసిన సినిమా. బాలీవుడ్లో ఓ సినిమా విడుదల కావాలంటే.. యేడాది ముందే క్లియరెన్స్ తీసుకోవాలి. అప్పటికప్పుడు రిలీజ్ డేట్ మార్చడం అంత తేలిక కాదు. బాహుబలి 2 వస్తుందన్న ఆలోచనతో కొన్ని హిందీ సినిమాలు ఏప్రిల్ చివరి వారంలో రావడానికి సాహసించడం లేదు. బాహుబలి 2 రిలీజ్ డేట్ మారితే.. ఆ సినిమాలన్నీ రిలీజ్ డేట్లు మార్చుకోవాలి. ఇలాంటి గందరగోళ పరిస్థితి ఏర్పరచడం రాజమౌళి కి ఇష్టం లేదు. ఆ ఒక్క కారణం మినహాయిస్తే మాత్రం బాహుబలి 2 ముందే విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ రిలీజ్ డేట్ విషయంలో త్వరలోనే రాజమౌళి నిర్మాతలు, బయ్యర్లతో ఓ మీటింగ్ ఏర్పాటు చేస్తారని, ఆ తరవాతే నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. సో.. బాహుబలి 2 రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పులైనా జరగొచ్చు. అదేంటన్నది కాలమే చెప్పాలి.