ఆ లోపాలు బాహుబలి 2లో ఉండవట

బాహుబలి పార్ట్ వన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొట్టడంతో బాహుబలి-2మీద ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో మరింత సంచలనం సృష్టించేరీతిలో బాహుబలి-2ని రెడీచేయాలని చిత్రబృందం శ్రమిస్తోంది. పార్ట్ -1 ద్వారా ఎదురైన విమర్శలు, లోపాలు చివరి పార్ట్ లో తలెత్తకుండా పకడ్బందీగా దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. పార్ట్ -2 ప్రాజెక్ట్ ని రాజమౌళి ఓ సవాల్ గా తీసుకున్నారు.

బాహుబలి -1లో గ్రాఫిక్స్ పరంగానూ, కథాగమనం పరంగానూ వస్తున్న విమర్శలను రాజమౌళి పరిగణలోకి తీసుకుని పార్ట్ 2లో ఏ చిన్న విమర్శకూ తావివ్వకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా మార్కెట్ అంచనాలు పెరిగిపోతుండటంతో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా నూటికినూరుశాతం పర్ఫెక్ట్ గాఉండేలా చివరి భాగం తీయబోతున్నారు. బాహుబలి పార్ట్ 1లో కొన్ని చోట్ల సహజత్వానికి దగ్గరగాలేని విధంగా గ్రాఫిక్స్ కనిపించాయన్న విమర్శలు వచ్చాయి. కథలో లీనమవడంతో చాలా సన్నివేశాలు చూసేవారికి అవి గ్రాఫిక్స్ ప్రభావమని అనిపించకపోయినా, ఆ తర్వాత నిదానంగా చూస్తుంటే లోపాలున్నట్లు తెలుస్తోంది. చిన్నచిన్న పొరపాట్లు కనిపించాయన్న విషయం చిత్రనిర్మాణ బృందమే అంగీకరించే పరిస్థితి వచ్చింది. అలాగే కథగామనంలో కూడా శృతిమించిన శృంగార సన్నివేశం (శివుడు-అవంతిక సీన్) , ప్రతీకారం తీర్చుకునే సన్నివేశం (దేవయాని పుల్లలు ఏరుకోవడం), మేకప్ విషయంలో లోపాలు వంటివాటిపై వచ్చిన విమర్శలను కూడా రాజమౌళి గమనించి, చివరి భాగం చిత్రీకరణలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు తెలిసింది.

హిందీలోనూ షూట్

పార్ట్-1 ని తెలుగు, తమిళ భాషల్లో షూట్ చేయగా, దాన్ని హిందీ, మళయాల భాషల్లో డబ్ చేశారు. అయితే, బాలీవుడ్ మార్కెట్ ని దృష్టిలోపెట్టుకుని పార్ట్ -2 ని హిందీలో డబ్బింగ్ చిత్రంగా కాకుండా డైరెక్ట్ చిత్రంగా విడుదలచేయాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఈ చివరి భాగం చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలతోపాటుగా హిందీలో కూడా షూట్ చేయబోతున్నారు. హిందీలో అగ్రశ్రేణి రచయితలు స్క్రిప్ట్ విషయంలో సహకరించబోతున్నట్లు చెప్పుకుంటున్నారు.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com