సిరిసిల్ల రాజయ్యకు బెయిల్ మంజూరు

కాంగ్రెస్ మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్యకు, అతని భార్య మాధవి, కొడుకు అనిల్ కి నిన్న వరంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వారు ముగ్గురూ ఆయన కోడలు సారికను, ముగ్గురు మనుమలను హత్య చేసారనే అభియోగంతో 2014నవంబరులో అరెస్ట్ చేయబడ్డారు. వారితో బాటు రాజయ్య కొడుకు అనిల్ రెండవ భార్య సనని కూడా అరెస్ట్ చేసారు. కానీ ఆమెకు బెయిల్ మంజూరు కాలేదు. వారు గతంలో కూడా రెండు సార్లు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్స్ వేశారు కానీ కోర్టు వాటిని తిరస్కరించింది. నేటికీ పోలీసులు ఆ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేయనందునే వారిని చట్ట ప్రకారం ఇంకా రిమాండ్ లో ఉంచేందుకు అవకాశం లేనందున కోర్టు వారికి బెయిలు మంజూరు చేయవలసి వచ్చింది. ఆ లెక్కన వారిని అరెస్ట్ చేసిన 10 రోజుల తరువాత అరెస్టయిన సనకి కూడా మరో 10రోజుల్లో బెయిల్ మంజూరు చేయవచ్చు.

రాజయ్య ఇంట్లోనే పై అంతస్తులో తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్న ఆయన కోడలు సారిక గదిలో 2014,నవంబర్ 4వ తేదీ తెల్లవారు జామున మంటలు చెలరేగడంతో సజీవ దహనం అయ్యేరు. తనను తన మామగారు రాజయ్య, అత్తగారు మాధవి, భర్త అనిల్ చాలా కాలంగా వేధిస్తున్నారని, ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపించేవారని ఆమె తన లాయరుకి, పోలీసులకి గతంలో పిర్యాదులు చేసింది. రాజయ్యకి కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఉపఎన్నికలలో పోటీ చేయడానికి టికెట్ ఇవ్వవద్దని కోరుతూ ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధికి కూడా లేఖ వ్రాసింది. అతను మళ్ళీ ఎంపిగా ఎన్నికయితే తనను ఇంకా వేధిస్తారని భయపడి ఆమె ఆత్మహత్య చేసుకొన్నట్లు వార్తలు వచ్చేయి. రాజయ్య, అతని భార్య, కొడుకు ఆమెను చాలా వేధించేవారని వారి ఇంట్లో పనిమనిషి, డ్రైవరు పోలీసులకి చెప్పారు.

సుమారు నాలుగు నెలలు గడిచినా ఇంత వరకు ఈ కేసులో పోలీసులు చార్జ్ షీట్ ఎందుకు దాఖలు చేయలేదని ఆ కేసును దర్యాప్తు చేస్తున్న హన్మకొండ ఏ.సి.పి. శోభన్ కుమార్ ని ప్రశ్నించగా, తమకు ఇంత వరకు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబ్ నుండి ఇంత వరకు కూడా డి.ఎన్.ఏ. పరీక్ష నివేదిక, స్వర పరీక్ష మరియు చేతివ్రాతపై నివేదికలు అందలేదని, అందుకే చార్జ్ షీట్ దాఖలు చేయలేకపోయామని చెప్పారు. ఒకవేళ తాము ప్రాధమిక చార్జ్ షీట్ దాఖలు చేసినప్పటికీ వారు ముగ్గురికీ బెయిల్ మంజూరు అయ్యి ఉండేదని ఆయన జవాబు చెప్పడం గమనార్హం.

రాజయ్య కుటుంబానికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసు విచారణకు ఎటువంటి ఆటంకం కలిగించకూడదని, ఒత్తిళ్ళు చేయడానికి ప్రయత్నించరాదని న్యాయమూర్తి రాజయ్యను హెచ్చరించారు. కానీ నాలుగు నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబ్ నుండి నివేదిక రాలేదంటే అందుకు రాజకీయ ఒత్తిళ్ళే కారణమయుండవచ్చునని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఓటుకి నోటు కేసులో రేవంత్ రెడ్డి తదితరులపై ఆఘమేఘాల మీద నివేదికలు సమర్పించిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబ్ అధికారులు సిరిసిల్ల రాజయ్య కేసులో తమ నివేదికకి ఎంత ప్రాధాన్యత ఉందో తెలిసిన్నప్పటికీ ఇంత వరకు నివేదిక ఇవ్వలేదంటే వారిపై అతను రాజకీయంగా ఒత్తిళ్ళు తెచ్చి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అటువంటప్పుడు అతను బెయిల్ పై విడుదలయిన తరువాత ఈ కేసు నుండి తప్పించుకొనేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటారని అనుకోలేము. ఈ కేసులో బహుశః అనిల్ రెండవ భార్య సనని బలిపశువు అవుతుందేమో? రాజయ్య విడుదలపై మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com