పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ సర్జికల్ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తరువాతి నుంచి రెండు దేశాల సరిహద్దు మధ్యా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణమైన యుద్ధం రావొచ్చన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంకోపక్క పాక్ కూడా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఉగ్రవాదులపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు! ఉగ్రవాదాన్ని సహించేది లేదంటూ నటసింహం గర్జించింది! హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఉగ్రవాదులపై నిప్పులు చెరిగారు.
ఉగ్రవాదులు హద్దులు దాటి బరితెగిస్తే దేశ ప్రజలు సహించే పరిస్థితి లేదని బాలయ్య మండిపడ్డారు. రక్తానికి జాతి ఉండదూ మాంసానికి మతముండదూ చర్మానికీ కులముండదని తనదైన శైలిలో సూపర్ పంచ్ వేశారు. మనదేశం ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉందనీ, ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఎంతో గౌరవిస్తారని బాలయ్య చెప్పారు. మన ప్రజలకు ఓపిక ఎక్కువనీ, అలాగని ఉగ్రవాదులు బరి తెగిస్తూ పోతే ఓపిక నశిస్తుందని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనికైనా ఒక హద్దు ఉంటుందనీ, ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పీడ ఈ ఉగ్రవాదమే అని ఆయన ఖండించారు. ఉగ్రవాదులు మాట వినకపోతే ధీటైన సమాధానం చెప్పాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
మొత్తానికి బాలయ్య తనదైన శైలిలో బాగానే చెప్పారని అభిమానులు అంటున్నారు. నిజానికి, యురీ ఘటన తరువాత రాష్ట్ర స్థాయి నేతలెవ్వరూ పెద్దగా స్పందించినట్టు వార్తలే రావడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగానీ, ఇతర నేతలుగానీ ఉగ్రవాదం గురించీ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం గురించి ధీటుగా మాట్లాడిన సందర్భాలే లేవనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య స్పందించడం ప్రత్యేకంగానే చెప్పుకోవాలి. ఉగ్రవాదం గురించి బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన తొడకొడితే ఉగ్రవాదులు కూడా ఉలికిపడాల్సిందే అంటూ కొంతమంది అభిమానులు బాలయ్య కామెంట్స్‌ను మెచ్చుకుంటున్నారు.