నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున ఇద్దరూ ఒకే సినిమాలో కలసి నటించబోతున్నారా? ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. రజనీకాంత్ నటిస్తున్న సినిమా ‘జైలర్ 2’. ఇందులో బాలకృష్ణ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు ఇది వరకే వచ్చాయి. ఇప్పుడు నాగార్జున కూడా ఈ టీమ్ లో కలిసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగ్ ప్రధాన ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. నెల్సన్ ఇది వరకే నాగ్ ని కలిసి కథ చెప్పినట్టు, నాగ్ కూడా ఈ సినిమాలో నటించడానికి సూత ప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. రజనీకాంత్ ‘కూలీ’లో కూడా నాగ్ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రజనీకాంత్ తో వరుసగా రెండో సినిమా చేయబోతున్నాడన్నమాట.
ఎప్పుడైతే ‘జైలర్ 2’లో నాగ్ అనే వార్త బయటకు వచ్చిందో… అప్పుడే బాలయ్య, నాగ్ ఒకే ఫ్రేములో కనిపిస్తారా? కనిపిస్తే ఎలా ఉండబోతోంది? అనే చర్చ మొదలైపోయింది. బాలయ్య, నాగ్ ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇద్దరి మధ్యా కమ్యునికేషన్ గ్యాప్ ఉంది. ఇద్దరికీ పడడం లేదని, మాట్లాడుకోరని, ఒకరి ప్రస్తావన మరొకరి దగ్గరకు తీసుకురారని ఫిల్మ్ నగర్ లో చెప్పుకొంటుంటారు. బాలయ్య ఇటీవల చేసుకొన్న కొన్ని ముఖ్యమైన వేడులకు సైతం నాగ్ రాలేదు. ‘అన్ స్టాపబుల్’ లో నాగ్ ప్రస్తావన ఉండదు. నాగ్ ఈ షోకి వెళ్లలేదు. నాగ్ చేస్తున్న ‘బిగ్ బాస్’ షోలోనూ నాగ్ అడుగుపెట్టలేదు. ఇలాంటిది వీరిద్దరూ ఒకే సినిమాలో ఎలా కనిపిస్తారన్నది ప్రధానమైన ప్రశ్న.
అయితే.. ‘జైలర్ 2’లో నాగ్, బాలయ్య నటించినా, కలిసి కనిపించే ఒక్క ఫ్రేమ్ కూడా ఉండదని తెలుస్తోంది. `జైలర్`లో మోహన్ లాల్, శివరాజ్‌కుమార్ ఇద్దరూ నటించారు. కానీ ఒక్క ఫ్రేమ్ లో రాలేదు. ఈసారీ అంతేనని సమాచారం. అయితే నాగ్ ది ఫుల్ లెంగ్త్ రోల్ అని, ఆయనే మెయిన్ విలన్ అని తెలుస్తోంది. పారితోషికం కూడా భారీగానే అందుకోబోతున్నాడట. ‘కూలీ’, ‘కుబేర’ సినిమాలకూ నాగ్ గట్టిగానే తీసుకొన్నాడు. నాగ్ హీరోగా నటించేటప్పుడు అందుకొన్న రెమ్యునరేషన్ కంటే, ఇది ఎక్కువట. సో.. నాగ్ కి ఈ బేరాలే బాగున్నాయన్నమాట.