‘రైతు’ కోసం బాల‌య్య సంచ‌ల‌న ప్రయోగం

టాలీవుడ్ హీరోల‌పై ఓ అప‌వాదు ఉంది. స్టార్ హీరోల వ‌య‌సు యాభైకి పైబ‌డినా ఇప్ప‌టికీ కుర్ర హీరోల్లా క‌నిపించ‌డానికి తాప‌త్ర‌య‌ప‌డుతుంటార‌ని, త‌మ కూతురు వ‌య‌సున్న హీరోయిన్ల‌తో రొమాన్స్ చేయ‌డానికి ఏమాత్రం వెనుకంజ వేయ‌ర‌ని నెగిటీవ్ కామెంట్లు చేస్తుంటారు. ఆ మాట‌ల్లోనూ నిజం ఉంది. అగ్ర హీరోలుగా చ‌లామ‌ణీ అవుతున్న‌వాళ్ల వ‌య‌సు 50 దాటేసింది. వాళ్లంతా తెలుగు సినిమా వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి పెళ్లికాని బ్ర‌హ్మ‌చారి పాత్ర‌ల్లోనే క‌నిపించ‌డానికి మొగ్గు చూపుతుంటారు. అయితే ఓ మంచి క‌థ వ‌స్తే.. ఈ ట్రెండ్‌నీ, త‌మ ఇమేజ్‌నీ ప‌క్క‌న పెట్ట‌డానికి కూడా సిద్ధం అవుతుంటారు… అచ్చం మ‌న నంద‌మూరి బాల‌కృష్ణ‌లా.

అవును.. బాల‌య్య త‌న కెరీర్‌లోనే ఓ విభిన్న ప్ర‌యోగం చేయ‌బోతున్నాడ‌ని టాక్. ఆయ‌న కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌బోయే చిత్రం.. `రైతు`. ఈ సినిమాలో 70 ఏళ్ల వ్య‌క్తిగా బాల‌య్య క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. అంటే… పండు ముదుస‌లి అన్న‌మాట‌. ఓల్డ్ గెట‌ప్పుల్లో క‌నిపించ‌డం బాల‌య్య‌కు కొత్తేం కాదు. పెద్ద‌న్న‌య్య నుంచి అధినాయ‌కుడు వ‌ర‌కూ ఆ త‌ర‌హా పాత్ర‌లు బాగా పండించాడు. అయితే.. అందులో యంగ్ క్యారెక్ట‌ర్ కూడా ఉంటుంది. డ్యూయెట్లు, ల‌వ్‌… మామూలే. అయితే రైతులో మాత్రం బాల‌య్య ఓపెనింగ్ సీన్ నుంచీ శుభం కార్డు వ‌ర‌కూ 70 ఏళ్ల ముస‌లి వ్య‌క్తిగానే క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఓ రైతు ఎలా ఉంటాడో.. ఎలా ఆలోచిస్తాడో, ఎలా న‌డుస్తాడో.. ఏం క‌ట్టుకొంటాడో.. అలానే బాల‌య్య పాత్ర ఉండ‌బోతోంద‌ట‌. టాలీవుడ్ వ‌రకూ నిజంగా ఇది క‌నీవినీ ఎరుగ‌ని ప్ర‌యోగ‌మే. కేవ‌లం క‌థ న‌చ్చి.. అందులో త‌న పాత్ర న‌చ్చి… ఈ ప్ర‌యోగం చేయ‌డానికి బాల‌య్య ముందుకొచ్చాడ‌ట‌. బాల‌య్య ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం నిజంగా గొప్ప విష‌య‌మే. కానీ.. ఆయ‌న ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకొంటారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com