టాలీవుడ్ అగ్రహీరోలంతా జగన్ ను కలిసిన రోజు ..లోపల బయటకు రాని వ్యవహారాలు కూడా జరిగాయని అసెంబ్లీలో చర్చల్లో వెలుగులోకి వచ్చింది. తాడేపల్లి నుంచి వచ్చిన ఆహ్వానం మేరుక చిరంజీవి మహేష్, ప్రభాస్ వంటి అగ్రహీరోలతో తాడేపల్లికి వెళ్లారు. కానీ జగన్ రెడ్డి హీరోలంతా వచ్చి తన కోసం ఎదురు చూస్తూంటే..తనకు కుదరదు.. సినిమాటోగ్రఫీ మంత్రి అయిన పేర్ని నానితో మాట్లాడి వెళ్లండి అని సమాచారం ఇచ్చారట. దీంతో చిరంజీవి గట్టిగా నిలదీశారని.. మీరు ఆహ్వానిస్తేనే అందరూ వచ్చారని ఇప్పుడు సమావేశానికి రాకపోవడం ఏమిటని ప్రశ్నించారని అంటున్నారు. ఈ కారణంగానే జగన్ హీరోలతో సమావేశానికి వచ్చారని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. వచ్చిన తర్వాత చిరంజీవిని అవమానించారన్నారు.
ఈ మాటలను సభలోనే ఉన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఖండించారు. జగన్ను ఎవరూ గట్టిగా నిలదీయలేదన్నారు. చిరంజీవి పేరును నేరుగా ప్రస్తావించకపోయినా కామినేని.. జగన్ ను గట్టిగా నిలదీశారని చెప్పడాన్ని బాలకృష్ణ ఖండించినట్లయింది. హీరోలు అందర్నీ పిలిచి ఆ సైకో అవమానించాడని బాలకృష్ణ అన్నారు. ఎవరూ గట్టిగా నిలదీయలేదని చెప్పారు. నిజానికి ఆ సమావేశానికి బాలకృష్ణ రాలేదు. అయినప్పటికీ బాలకృష్ణ …ఖండించారు. చిరంజీవికి కాస్త హీరోయిజాన్ని అన్వయించి చెప్పడం బాలకృష్ణకు నచ్చలేదని అందుకే అలా స్పందించారని అంటున్నారు.
అదే సమయంలో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఎఫ్డీసీ సమావేశంలో తన పేరును తొమ్మిదో స్థానంలో పెట్టారన్నారు. తాను ఈ విషయంపై వెంటనే కందుల దుర్గేష్తోనూ మాట్లాడానన్నారు. ఇలా అసెంబ్లీలో చిరంజీవి ప్రస్తావన రావడం..దానికి బాలకృష్ణ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే జగన్ ఆ రోజు చేసిన వ్యవహారం మరోసారి చర్చనీయాంశమయింది.