చిరంజీవి గురించి బాలకృష్ణ అలాగా ఎందుకనేసారో!

ఈనెల 27,28 వ తేదీలలో అనంతపురం జిల్లాలో జరుగబోయే లేపాక్షి ఉత్సవాల నిర్వహణ బాధ్యతను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన భుజాన్న వేసుకొన్నారు. వాటిని విజయవంతం చేయడం కోసం ఆయన చాలా శ్రమిస్తున్నారు. ఆయనే స్వయంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖులను కలిసి ఆహ్వానపత్రాలు అందజేసి ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిన్న ఆహ్వానించిన తరువాత బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ ఉత్సవాలకి చిరంజీవిని ఆహ్వానించారా? అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన జవాబు చాలా ఆశ్చర్యం కలిగించింది.

“సినీ పరిశ్రమ నుంచి మోహన్ బాబు, జయసుధ గారిని తప్ప మరెవరినీ పిలవలేదు. నేను ఎవరినీ నెత్తిన ఎక్కించుకోను. అందుకు సిద్దమయితే చాలా రకాల మనుషులు వస్తారు. చాలా రకాల మాటలు మాట్లాడతారు. అందుకే ఎవరిని పిలవాలో వారిని మాత్రమే పిలుస్తున్నాను.నేను నా పద్దతిలో అంటే ‘డిక్టేటర్’ పద్దతిలో వెళ్తాను. ఇది నా కష్టార్జితం. వేదిక మీద నా పక్కన నిలబడితే చాలా మందికి గ్లామర్ వస్తుంది.  ఎవరినీ నేను పిలవదలచుకోలేదు,” జవాబు ఇచ్చేరు.

చిరంజీవి గురించి బాలకృష్ణ ఈవిధంగా అనుచితంగా మాట్లాడవలసిన అవసరమే లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కనుక ఈ ఉత్సవాలకు పిలవకూడదని  అనుకొంటే అనుకోవచ్చును. కానీతెలంగాణాలో తెదేపాను తుడిచిపెట్టేస్తున్న తెరాస మంత్రుల వద్దకు పనికట్టుకొని వెళ్లి ఆహ్వానిస్తున్నప్పుడు తన సహ నటుడు చిరంజీవిని ఆహ్వానించడానికి అయిష్టత చూపడం, పైగా ఆయన గురించి ఈవిధంగా అనుచితంగా మాట్లాడటం సరి కాదనే చెప్పాలి.

సినీ పరిశ్రమలో వారిని ఉద్దేశ్యించి ‘ఎవరినీ నెత్తికి ఎక్కించుకోను..నా పక్కన నిలబడితే చాలా మందికి గ్లామర్ వస్తుందని’ చెప్పడం కూడా చాలా అసందర్భంగా, అనుచితంగా ఉంది. చిరంజీవితో సహా సినీ తారలు అందరికీ ఎవరి అభిమానులు వారికున్నారు. ఎవరి ఇమేజ్ వారికుంది. ఏదో చిన్న చిన్న హీరోలు వచ్చి ఆయన పక్కన నిలబడితే వారికి గ్లామర్ వస్తుందేమో కానీ చిరంజీవికి కాదు. ఆయనని అమితంగా ఆరాధించే అభిమానులు రెండు రాష్ట్రాలలో బోలెడుమంది ఉన్నారు.

‘డిక్టేటర్’ సినిమా బాగుండవచ్చును. సినిమాలో డిక్టేటర్ స్టైల్, నేను డిక్టేటర్ ని అంటూ ఆయన చెప్పిన డైలాగులు చాలా గొప్పగా ఉండవచ్చును. కానీ నిజ జీవితంలో ఆ విధంగా వ్యవహరిస్తే దానిని అహంకారంగా భావిస్తారు. దాని వలన విమర్శలు మూటకట్టుకోక తప్పదు. చేజేతులా శత్రువులను తయారు చేసుకొని అందరినీ దూరం చేసుకొన్నట్లవుతుంది తప్ప మరే ప్రయోజనం ఉండదు.

‘ఇది నా కష్టార్జితం’ అని బాలకృష్ణ చెప్పడం కూడా సరికాదనే చెప్పకతప్పదు. సినీ పరిశ్రమలో తను చాలా కష్టపడి పైకి ఎదిగానని చెప్పుకోవడం దాని ఉద్దేశ్యమయితే తప్పు లేదు. కానీ అంత మాత్రాన్న సహా నటుల గురించి చులకనగా మాట్లాడవలసిన అవసరం లేదు. లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడాన్ని ఆయన ‘తన కష్టార్జితంగా’ భావిస్తూ ఈ మాట అన్నట్లయితే అదీ తప్పే. ఎందుకంటే అది ప్రజాధనంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం. దానిని విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఆయన భుజానికి ఎత్తుకొన్నందుకు ఆయనను అభినందించాల్సిందే. కానీ ఈ కార్యక్రమానికి ఎవరిని పిలవాలో ఎవరిని దూరంగా ఉంచాలో తనే డిక్టేటర్ లాగ నిర్ణయిస్తానని చెప్పడం చాలా తప్పు. దేశవ్యాప్తంగా లేపాక్షికి గుర్తింపు తెచ్చేందుకే ప్రభుత్వం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పుడు, దానికి అందరూ ఆహ్వానితులేనని ఆయన చెప్పి ఉండి ఉంటే చాలా పద్దతిగా ఉండేది. సినీ రాజకీయ ప్రముఖులు అందరూ ఆ ఉత్సవాలకు తరలివస్తే దాని వలన అవి అందరి దృష్టిని ఆకట్టుకొనే అవకాశం ఉంటుంది. తత్ఫలితంగా లేపాక్షికి ఏదయినా మేలు జరిగే అవకాశం ఉండేది కదా!

బాలకృష్ణ సినిమాలతో తీరిక లేకుండా ఉంటున్నప్పటికీ, తెదేపాలో మిగిలిన అందరు ఎమ్మెల్యేల కంటే చాలా బాగా పనిచేస్తూ తన హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని, ప్రజలతో నేరుగా మాట్లాడుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని మంచి పేరు సంపాదించుకొన్నారు. ఇటీవల ఒక సినిమా కార్యక్రమంలో అందరితో చాలా స్నేహపూర్వకంగా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకొన్నారు. కానీ ఇటువంటి అనవసరమయిన మాటల వలన అయన ‘కష్టార్జితం’ అంతా బూడిదలో పోసిన పన్నీరే అయ్యే అవకాశం ఉంటుంది. తన మనసులో ఉన్న భావాలను, ఇతరుల గురించి తన అభిప్రాయాలను మీడియా ముందు బయటపెట్టేసుకోవడాన్ని ఆయన అభిమానులు ‘భోళాతనం’ అని సరిపెట్టుకోవచ్చు కానీ దాని వలన సినీ పరిశ్రమలో, ప్రజలలో చెడ్డపేరు మూటగట్టుకొని, చేజేతులా శత్రువులను సృష్టించుకొన్నట్లవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com