ఇది వరకటి బాలకృష్ణ వేరు. ఇప్పటి బాలకృష్ణ వేరు. సినిమాల మీద సినిమాలు చేస్తూ.. యమ స్పీడుగా దూసుకుపోతున్నాడు. ఓ సినిమా పట్టాలపై ఉండగానే, రెండు మూడు ప్రాజెక్టులు సెట్ చేసుకొంటున్నాడు. ప్రస్తుతం ‘అఖండ 2’తో బిజీగా ఉన్న బాలయ్య ఓ వైపు క్రిష్, మరోవైపు గోపీచంద్ మలినేని కథలకు ఓకే చెప్పాడు. ‘జైలర్ 2’లో కూడా బాలయ్య కనిపించబోతున్నాడని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కథకూ పచ్చ జెండా ఊపాడన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ‘మార్క్ ఆంటోనీ’, ‘గుడ్ బాడ్ అగ్లీ’ సినిమాలతో ఆకట్టుకొన్నాడు అధిక్. తనకు మాస్ పల్స్ బాగా తెలుసు. ‘గుడ్ బాడ్ అగ్లీ’లో అజిత్ ని చూపించిన విధానం ఫ్యాన్స్ కి నచ్చింది. తనకు బాలయ్య లాంటి మాస్ హీరో తగిలితే.. కథే వేరుగా ఉంటుంది. అందుకే బాలయ్య కోసం ఓ కథ రెడీ చేసుకోవడం, వినిపించడం జరిగిపోయాయి. బాలయ్య కూడా ఈ దర్శకుడితో పని చేయడానికి ఉత్సాహంగానే ఉన్నాడు.
కాకపోతే బాలయ్య లైనప్ వచ్చే రేండేళ్లకు సరిపడగా ఉంది. ఈ జూన్‌లో గోపీచంద్ మలినేని సినిమాని మొదలెడతారు. దసరాకు క్రిష్ సినిమా ఉండొచ్చు. ఈ రెండు సినిమాల్నీ ఒకేసారి పూర్తి చేయాలన్నది ప్లాన్. మధ్యలో `జైలర్ 2`కి ఓకే చెబుతాడు. ఆ తరవాతే… అధిక్ సినిమా ఉండొచ్చు. గోపీచంద్ మలినేని సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంది. క్రిష్ సినిమా మాత్రం టైమ్ పడుతుంది. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేసే కథ అది. దానికి తోడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఆసినిమాతోనే. కాబట్టి ఆ సినిమాని ఎలాంటి కంగారు లేకుండా నిదానంగా పూర్తి చేయాలి. ఈలోగా హిందూపూర్ ఎం.ఎల్.ఏ బాధ్యతలు, బసవతారకం పనులూ ఉంటాయి. వీటన్నింటికీ టైమ్ కేటాయించాలి. ఇప్పుడు తమిళ దర్శకుడి కథని ఓకే చేసినా, పట్టాలెక్కడానికి టైమ్ పట్టే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ కాంబో ఎప్పుడు సెట్ అయినా… క్రేజ్ మాత్రం ఆకాశాన్ని అంటడం ఖాయం.