ప్రతి దర్శకుడికీ ఓ స్టైల్ ఉంటుంది. తన బలాల్ని ఎప్పుడూ వదులుకోకూడదు. కొత్త తరహా ప్రయత్నాలు చేసినా, తన స్ట్రైంత్ ని దాటి బయటకు రాకూడదు. ఈ సిద్ధాంతాన్ని బోయపాటి శ్రీను బలంగా నమ్ముతాడు. తన ప్రతీ సినిమాలోనూ యాక్షన్ దంచి కొడుతుంటాడు. అదే తన బలం కూడా. అభిమానులకు కూడా అదే నచ్చుతుంది. బాలకృష్ణతో చేసిన మూడు సినిమాల్లోనూ ఇది ఉంది. సింహా, లెజెండ్, అఖండ సినిమాలు హిట్ అవ్వడానికి కారణం అదే. బాలయ్యనికొత్తగా చూపిస్తూనే, తన బలాన్ని బలంగా ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు ‘అఖండ 2’ వస్తోంది. ఇందులోనూ తన మార్క్ ఏమాత్రం వదల్లేదు.
ఈ రోజు ‘బ్లాస్టింగ్ రోర్’ పేరుతో ఓ గ్లింప్స్ విడుదల చేశారు. ఇక్కడ కూడా బోయపాటి తన ముద్ర కొంచెం గట్టిగానే చూపించే ప్రయత్నం చేశారు. బాలయ్య గెటప్ ఎప్పట్లా బాగుంది. తనలోని రౌద్ర రసం బాగా చూపించే బోయపాటి మళ్లీ అదే మార్క్ లో ఈ గ్లింప్స్ ని రెడీ చేశారు. ‘సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో.. ఏ సౌండ్ కు నవ్వుతానో, ఏ సౌండ్ కు నరుకుతానో నాకే తెలీదు..’ అంటూ మాస్ కి నచ్చే డైలాగ్ ఒకటి వదిలారు. తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మళ్లీ మ్యాజిక్ చేశాడు. నిమిషం లోపు ముగిసిన గ్లింప్స్ ఇది. ఇందులోనే ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే ఎఫెక్ట్ ఇచ్చారు బోయపాటి. ఇక టీజరో, ట్రైలరో వదిలితే ఎలా ఉంటుందో..? డిసెంబరు 5న ‘అఖండ 2’ రాబోతోంది. మరో రెండు రోజుల షూటింగ్ పార్ట్ మిగిలి ఉన్నట్టు సమాచారం. అది ముగిస్తే.. గుమ్మడికాయ కొట్టేస్తారు. ఆ తరవాత.. పాటల్ని ఒకొక్కటిగా విడుదల చేస్తారు. ఈ సినిమా ముగిసిన వెంటనే.. గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కిస్తారు బాలయ్య. నవంబరు 7న లాంఛనంగా ప్రారంభించి, డిసెంబరు నుంచి షూటింగ్ మొదలెడతారు.