నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింహా, లెజెండ్, అఖండ సినిమాలతో సృష్టించిన సంచలనాలే సాక్ష్యాలు. ఇప్పుడు ‘అఖండ 2’ రెడీ అయిపోయింది. డిసెంబరు 5న ఈ సినిమా విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైలర్ వదిలారు.
ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇది బాలయ్య చేసిన సర్జికల్ స్ట్రైక్. అఖండలో హిందూధర్మ ఔన్నత్యం గురించి బాలయ్య చెప్పిన డైలాగులు బాగా పేలాయి. ఆ పార్ట్ చివరి 30 నిమిషాలు మాత్రమే. కానీ.. సినిమా మొత్తం హిందూ ధర్మం గురించే ఉంటే.. అది అఖండ 2 అవుతుంది. సనాతన ధర్మం, దాని విశిష్టత చెప్పే కథ ఇది. ఆ ధర్మాన్ని కాపాడడానికి ఒకరు.. నాశనం చేయడానికి మరొకరు పోటీ పడితే ఎలా ఉంటుందో ఈ సినిమా లో చూపిస్తున్నారు. ఆది పినిశెట్టి పాత్ర కూడా చాలా వైవిధ్యంగా కనిపిస్తోంది. దుష్టశక్తి – దైవశక్తి మధ్య జరిగే పోరాటం పై కూడా బోయపాటి గట్టిగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. విజువల్ గా ఈ సినిమా గ్రాండియర్ గా ఉండబోతోంది. మహా కుంభమేళాకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్లు ఈ సినిమాలో ఉన్నాయి. వాటిని చాలా లావీష్‌గా చూపించారు సినిమాలో.
‘కష్టం వస్తే దేవుడు వస్తాడు.. అని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు.. అని నమ్మించాలి.. అలా వాళ్లు నమ్మిన రోజు.. భారతదేశం మొత్తం తునాతునకలు అయిపోతుంది..’
‘ఈ ప్రపంచంలో మీరు ఏ దేశం వెళ్లినా మీకు కనిపించేది ఒక మతం.. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం.. సనాతన హైందవ ధర్మం..’
‘దేశం జోలికి వస్తే… మీరు దండిస్తారు.. మేం ఖండిస్తాం… మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్టైక్’ – లాంటి డైలాగులు ట్రైలర్ లో ఆకట్టుకొన్నాయి.
`మేం ఒకసారి లేచి శబ్దం చేస్తే.. ఈ ప్రపంచమే నిశ్శబ్దం`
తమన్ ఎప్పటిలానే తన బీజియమ్స్ తో మోత మోగించాడు. బోయపాటి మార్క్ యాక్షన్ ఘట్టాలకు కొదవలేదు. మొత్తానికి ట్రైలర్ లో చాలా హడావుడి కనిపించింది. బాలయ్య ఫ్యాన్స్‌కు పండగలాంటి సినిమా అనే భరోసా ఈ ట్రైలర్ ఇచ్చేసింది.