నందమూరి బాలకృష్ణ కేవలం వెండితెరపైనే కాదు, ప్రజా సేవలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు విజయం సాధించిన ఆయన, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా నియోజకవర్గ అభివృద్ధిని మాత్రం ఎప్పుడూ విస్మరించలేదు. తాజాగా హిందూపురం పట్టణంలో సుమారు 92.5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రైల్వే స్టేషన్ రోడ్డు వెడల్పు పనులు, సుందరీకరణ ప్రాజెక్టులతో హిందూపురం ముఖచిత్రాన్ని మార్చేందుకు బాలయ్య వేగంగా అడుగులు వేస్తున్నారు.
నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు బాలకృష్ణ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గత 12 ఏళ్లుగా అద్దె ఇంట్లో లేదా అతిథి గృహాల్లో ఉంటూ వచ్చిన ఆయన, ఇప్పుడు హిందూపురంలోనే సొంత నివాసాన్ని నిర్మించుకుంటున్నారు. ఫిబ్రవరి 19న తన సతీమణితో ఈ నూతన గృహ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ప్రజల ప్రాథమిక అవసరాలైన తాగునీరు , సాగునీటి సమస్యల పరిష్కారంలో బాలయ్య చూపుతున్న చొరవ ప్రజల్ని సంతృప్తి పరుస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న హంద్రీనీవా జలాలను నియోజకవర్గంలోని చెరువులకు మళ్లించి, స్వయంగా జలహారతి పట్టడం అక్కడి రైతులకు కొండంత అండను ఇచ్చింది.
అలాగే లేపాక్షి మండలంలో కోట్లాది రూపాయలతో బీటీ రోడ్ల నిర్మాణం, పట్టుగూళ్ల మార్కెట్ ఏర్పాటు వంటి పనుల ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉంటున్నప్పటికీ ఎమ్మెల్యే అందుబాటులో లేరనే విమర్శకు తావులేకుండా, తన ప్రతినిధుల ద్వారా నిత్యం ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నారు.
కేవలం రాజకీయ నేతగానే కాకుండా, మానవతావాదిగా బాలకృష్ణ అందిస్తున్న సేవలు అనన్యసామాన్యం. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్గా హిందూపురం నియోజకవర్గంలోని ఎంతోమంది పేదలకు ఉచిత వైద్యం అందేలా చూస్తున్నారు. ఇటీవల ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అత్యాధునిక మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాలను ప్రారంభించి, వైద్య సేవలను ప్రజల ముంగిటకే తీసుకెళ్లారు. అటు మాస్ హీరోగా వెండితెరకు వన్నె తెస్తూనే, ఇటు బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా హిందూపురాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజల అభిమానాన్ని పెంచుకుంటున్నారు.
